The Raja Saab: ‘ది రాజా సాబ్’ వాయిదా పడనుందా.. మూవీ టీమ్ ఏం చెప్పిందంటే?
The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇది నిజంగా తీపి కబురు. ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలపై కొద్ది రోజులుగా వినిపిస్తున్న పుకార్లకు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా తెరదించింది. సినిమా వాయిదా పడుతుందని వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పింది. అనుకున్న సమయానికి అంటే 2025 సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని స్పష్టం చేసింది.
చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ‘రాజా సాబ్’కు సంబంధించిన గ్రాఫిక్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపింది. సినిమాను జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఐమాక్స్ వెర్షన్‌తో పాటు అన్ని ప్రధాన ఫార్మాట్‌లలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.
నిర్మాణ సంస్థ విడుదల చేసిన నోట్‌లో, “విశ్వప్రసాద్ గారు ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మారుతి గారు ప్రతి అంశంపైనా ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యత విషయంలో రెట్టింపు శ్రద్ధ తీసుకుంటున్నారు. డిసెంబర్ 25 నాటికి సినిమాకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసి, ఫస్ట్ కాపీని సిద్ధం చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం” అని పేర్కొంది.
ప్రమోషన్స్‌లో భాగంగా డిసెంబర్ నెలలో అమెరికాలో ఓ భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదట డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, పనుల ఆలస్యం కారణంగానే జనవరి 9కు వాయిదా వేయడం జరిగింది. తాజా ప్రకటనతో, ఈ సంక్రాంతికి థియేటర్లలో ప్రభాస్ సందడి రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
