Prabhas: ‘ఫౌజీ’ సెట్‌లో ప్రభాస్ స్వీట్ వార్నింగ్: దర్శకుడు హను రాఘవపూడికి ఏం చెప్పాడంటే?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక అంచనాలున్న చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్‌లో పెడుతూ అటు అభిమానులతో పాటు ఇటు సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే, ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ‘ఫౌజీ’ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టు, హను రాఘవపూడి క్లాసిక్ లవ్‌స్టోరీ ‘సీతారామం’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, ఇటీవల సెట్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సినీ వర్గాల్లో తెలిసిన దాని ప్రకారం, హను రాఘవపూడి సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చాలా కఠినంగా ఉంటారని పేరుంది. ఆయనకున్న డెడికేషన్ వల్ల కొన్నిసార్లు కోపాన్ని అదుపు చేసుకోలేరని, ఇది సెట్‌లో పలుమార్లు కనిపించిందని వార్తలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో, హనుతో పాజిటివ్ వాతావరణంలోనే మాట్లాడిన ప్రభాస్, “మీకున్న డెడికేషన్, వర్క్ మీద ప్యాషన్ అద్భుతం. కానీ, ఆ కోపాన్ని కాస్త తగ్గించుకోండి” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ఈ సంఘటన చిత్ర యూనిట్‌లో ఒక కొత్త చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హను మాట్లాడుతూ, ‘ఫౌజీ’ కథ తాను చాలా కాలం నుంచి రాసుకుంటున్నానని, ప్రత్యేకంగా ప్రభాస్ కోసమే ఈ స్క్రిప్ట్‌ను పూర్తి చేశానని వెల్లడించారు. ‘సీతారామం’ తర్వాత దాదాపు రెండేళ్లు ఈ కథపైనే కష్టపడ్డానని, ఇది తాను రాసిన ఆరు ఆర్మీ కథల్లోకెల్లా అత్యుత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. “ప్రభాస్‌ను ఈ సినిమాలో ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా చూస్తారు. భావోద్వేగాలు, తీవ్రత, అలాగే మ్యాచో ఎలిమెంట్స్ కలగలిపిన పాత్ర అది” అని హను చెప్పారు. 2026 డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.