Prashanth Varma: ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోకి మరో సూపర్ హీరో: ‘అధీర’లో ఎస్.జె.సూర్య, కళ్యాణ్ దాసరి!
Prashanth Varma: ‘హనుమాన్’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో కొత్త ప్రాజెక్ట్‌లను వరుసగా ప్రకటిస్తున్నారు. గతంలో ‘మహాకాళి’ చిత్రాన్ని పరిచయం చేసిన ఆయన, తాజాగా తన యూనివర్స్‌లో రానున్న మరో సూపర్ హీరో సినిమా ‘అధీర’ గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రముఖ నటులు ఎస్.జె.సూర్య, కళ్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో వెల్లడించారు.
‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు.. వెలుగు రూపంలో ఆశాకిరణం పుట్టుకొస్తుంది’ అంటూ ‘అధీర’ నుంచి ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకున్నారు. ఇది ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోని ఒక సూపర్ హీరో చిత్రం అని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తారని కూడా ఆయన ప్రకటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ప్రశాంత్ వర్మ గతంలో చెప్పినట్లుగా, తన సినిమాటిక్ యూనివర్స్ కోసం దాదాపు 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మొదటి దశలో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలను రూపొందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ‘మహాకాళి’ని ప్రకటించారు. ‘మా యూనివర్స్‌లోకి కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అని గతంలో ‘మహాకాళి’ గురించి ప్రశాంత్ వర్మ తెలిపారు.
అంతేకాకుండా, ఈ ‘అధీర’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రంతో పాటు ప్రదర్శించాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో ‘ఓజీ’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ‘అధీర’తో పీవీసీయూలో మరో కొత్త అధ్యాయం మొదలు కానుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
