Preethi Case : డాక్టర్ ప్రీతి కేసు ఇటు వరంగల్ తో పాటు, అటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎన్నో సందేహాలతో మొదలైన ప్రీతి ఆత్మహత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 22న ప్రీతి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. పరిస్థితి విషమించడంతో అక్కడినుండి తర్వాత నిమ్స్‌కు తరలించగా.. ఫిబ్రవరి 26న చికిత్స పొందుతూ ప్రీతి మృతి చెందింది.
మొదటినుండి పోలీసులు ర్యాగింగ్ అనే కోణం నుండే కేసు దర్యాప్తు చేస్తూ వచ్చారు. అనుమానితుడిగా సైఫ్ పైనే వాళ్ళ దృష్టి సారించి విచారించారు. ప్రీతి ఆత్మహత్య కు సైఫ్ చేసిన ర్యాగింగే కారణం అని పోలిసులు భావించి సైఫ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నాలుగు రోజుల పోలీసు విచారణలో సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్, ప్రీతిని ర్యాగింగ్ చేసినట్లు పోలీసుల ఎదుట ఎట్టకేలకు ఒప్పుకొన్నట్లు సమాచారం.
మొదటి నుండి సైఫ్ ర్యాగింగ్ చేసినట్లు ఒప్పుకోలేదు. ఆ విషయాన్ని ఖండిస్తూ వచ్చాడు. వృత్తి రీత్యా తనతో మాట్లాడానే తప్పా, ఉద్దేశ్య పూర్వకంగా ప్రీతిని వేధించలేదని సైఫ్ వాదించాడు. కానీ పోలీసులు వాట్సప్ చాట్ ఆధారంగా, విచారణ జరిపారు. ఆధారాలు ఉండటంతో తను ర్యాగింగ్ చేసింది నిజమే అని సైఫ్ నేరాన్ని అంగీకరించాడు అని తెలుస్తుంది.