Pune Dowry Harrassment: స్నానం చేస్తుండగా భార్య వీడియోలు తీసిన ప్రభుత్వాధికారి..
Pune Dowry Harrassment: పుణెలో ఓ ప్రభుత్వ అధికారి కారు, హోంలోన్ ఈఎంఐలు కట్టడానికి తన భార్యను వేధించడం, వేధింపుల్లో భాగంగా ఆయన చేసిన ఓ చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన భార్య స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీసి వాటిని చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాడని ఆ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలో పుణెలోని అంబేగావ్‌లో జరిగింది.
కారు, హోంలోన్ ఈఎంఐలు చెల్లించడానికి డబ్బులు తీసుకురావాలంటూ, లేకపోతే స్నానం చేసేటప్పుడు రహస్యంగా తీసిన వీడియోలను ఆన్‌లైన్‌లో లీక్ చేస్తానని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ షాకింగ్ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
అనుమానం పెంచుకుని వేధింపులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు కూడా ఓ క్లాస్ 1 ప్రభుత్వ అధికారిణి. ఆమె నిందితుడైన తన భర్తను 2020లో వివాహం చేసుకుంది. పెళ్లయిన కొంతకాలం నుంచే భర్త తనపై అనుమానం పెంచుకుని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. భార్య కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు, రహస్యంగా పర్యవేక్షించేందుకు, ఇంట్లోని పలు ప్రాంతాల్లో, బాత్రూంలో కూడా రహస్య కెమెరాలను అమర్చినట్లు ఆరోపణలున్నాయి. భర్త పనిలో ఉన్నప్పుడు కూడా ఆమెను ట్రాక్ చేసేవాడని ఫిర్యాదులో ఉంది.
రూ.1.5 లక్షలు తీసుకురమ్మంటూ ఒత్తిడి..
తన తల్లిదండ్రుల నుంచి ₹1.5 లక్షలు తీసుకురావాలని భర్త పదేపదే ఒత్తిడి చేశాడని, లేకపోతే రహస్యంగా తీసిన స్నానం చేసే వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. అంతేకాకుండా, వివాహమైనప్పటి నుంచి అత్త, మామ, బావ, ఆడపడుచు సహా మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులు – తనను నిరంతరం వేధించారని, పుట్టింటి నుంచి డబ్బు, కారు తీసుకురావాలని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించింది.
ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు భర్తతో పాటు అతని ఏడుగురు బంధువులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని బ్లాక్‌మెయిల్, గృహ హింస, దోపిడీ, ప్రైవసీ వయోలేషన్ వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను, వీడియో ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఎవరినీ అరెస్టు చేయలేదని, మహిళ ఆరోపణలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.