Puri Sethupathi: పూరి – సేతుపతి.. 5 నెలల్లోనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్యాకప్
Puri Sethupathi: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ప్యూరిసేతుపతి’ షూటింగ్ ఘనంగా పూర్తయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది. జూలై మొదటి వారంలో ప్రారంభమైన ఈ చిత్రం కేవలం ఐదు నెలల్లోనే పూర్తి కావడం విశేషం.
షూటింగ్ చివరి రోజున, నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ సెట్స్‌లో విజయ్ సేతుపతి మాట్లాడిన వీడియోను పంచుకుంది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో, యూనిట్‌తో కలిసి పనిచేసిన సమయాన్ని మిస్ అవుతున్నానని, ఈ ప్రయాణం తనకు మధురమైన అనుభవం అని వ్యాఖ్యానించారు. పూరీ జగన్నాథ్ వేగవంతమైన పనితీరును, అంకితభావాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
షూటింగ్ ముగియడంతో, చిత్ర బృందం ఇకపై ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటి టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, విటివి గణేష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరీ మార్క్ యాక్షన్ మరియు విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
