Raashii Khanna: మార్కెట్ హీరోలదే కావచ్చు.. కానీ సెట్‌లో మాకూ అది కావాలి.. ఇండస్ట్రీ తీరుపై రాశీ ఖన్నా కామెంట్స్
Raashii Khanna: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, మరీ ముఖ్యంగా దక్షిణాది సినిమాల్లో ‘హీరో వర్షిప్’ అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. కథ, కథనం, బడ్జెట్, చివరకు బాక్సాఫీస్ లెక్కలు కూడా హీరో చుట్టూనే తిరుగుతుంటాయి. ఈ క్రమంలో హీరోయిన్లకు కేవలం గ్లామర్ బొమ్మలుగానే చూస్తారనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఇదే విషయంపై టాలీవుడ్ గ్లామర్ డాల్ రాశీ ఖన్నా స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీ ఖన్నా.. జిల్, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ, బాలీవుడ్‌లో ‘ఫర్జీ’, ‘యోధ’ వంటి ప్రాజెక్టులతో తనలోని నటిని కొత్తగా ఆవిష్కరించుకుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలతో రాశీ మళ్ళీ ఫుల్ బిజీగా మారింది. ఈ తరుణంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని లింగ వివక్షపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
రాశీ ఖన్నా మాట్లాడుతూ.. “మన దగ్గర హీరో వర్షిప్ చాలా బలంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు తెచ్చేది మగవారే అని ఇండస్ట్రీ నమ్ముతుంది. అది వాస్తవం కూడా కావచ్చు. మార్కెట్ ఎవరికి ఎక్కువ ఉంటే, వారికే స్క్రీన్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది” అని వాస్తవాన్ని అంగీకరించారు. అయితే, అసలు సమస్య అది కాదని ఆమె స్పష్టం చేశారు.
“మార్కెట్ విషయం పక్కన పెడితే.. షూటింగ్ సెట్స్‌లో మాత్రం అందరికీ సమాన గౌరవం దక్కాలి. హీరోలకు ఇచ్చే మర్యాద, సౌకర్యాలు.. హీరోయిన్లకు లేదా ఇతర మహిళా ఆర్టిస్టులకు ఇవ్వడంలో వివక్ష చూపకూడదు. ప్రవర్తనలో, గౌరవంలో జెండర్ అనే తేడా ఉండకూడదు. దురదృష్టవశాత్తు ఇంకా మన దగ్గర హీరోలకే అగ్ర తాంబూలం అనే పద్ధతి కొనసాగుతోంది” అని రాశీ నిష్కర్షగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టాలెంట్ ఉన్నా కూడా హీరోయిన్లను రెండో తరగతిగా చూడటం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాశీ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. “రాశీ చెప్పింది అక్షరాలా నిజం.. గౌరవం అనేది అందరికీ సమానంగా ఉండాలి” అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
