Rahul Gandhi:రాహుల్ పై అనర్హత వేటు… తీవ్ర అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్, విపక్షాలు
దేశ రాజకీయాల్లో సంచలనం.. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అనర్హత నిర్ణయం గురువారం నుండే అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనితో కాంగ్రెస్ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది.
అయితే జైలు శిక్ష అంశానికి సంభందించి హైకోర్టు లో అప్పీలు చేసుకోవడానికి వీలుగా శిక్ష అమలును నెల రోజులపాటు నిలిపివేస్తున్నాం అని సూరత్ కోర్ట్ ప్రకటించినప్పటికి లోక్ సభ సెక్రటేరియట్ మాత్రం 24 గంటలు కూడా గడవకముందే రాహుల్ ని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించడం గమనార్హం.
దీనిని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించిగా, అటు దేశంలోని విపక్షాలు కూడా లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాహుల్ కి తమ సంఘీభావం ప్రకటించాయి. ఈ విషయంలో రాహుల్ కి పూర్తి మద్దతుగా ఉంటామని తెలిపాయి. అయితే రాహుల్ అనర్హత వేటుకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ పార్టీ “జనాందోళన్” పేరిట దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.