Rahul Ravindran: ‘మంగళసూత్రం’పై రాహుల్ రవీంద్రన్ హాట్ కామెంట్స్.. సినిమాపై ఎఫెక్ట్ పడుతుందా?
Rahul Ravindran: ‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా పరిచయమై, ఆపై ‘చి ల సౌ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన రాహుల్ రవీంద్రన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. నవంబర్ 7న విడుదల కానున్న ఆయన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (రష్మిక మందన్నా కథానాయిక) ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ దుమారానికి కారణమయ్యాయి.
రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించకపోవడం గురించి స్పందిస్తూ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీశాయి. “పెళ్లయ్యాక మహిళలు తప్పనిసరిగా మంగళసూత్రం ధరించాలనే ఆచారాన్ని నేను ఏమాత్రం సమర్థించను. అది పూర్తిగా చిన్మయి వ్యక్తిగత ఇష్టం. ఆమెను నేను ఎప్పుడూ బలవంతం చేయలేదు” అని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాదు ఈ ఆచారం లింగ వివక్ష కిందకు వస్తుందనే కోణంలో రాహుల్ రవీంద్రన్ ప్రశ్నించారు. “ఒక మహిళ మెడలో తాళి ఉంటేనే ఆమె వివాహిత అని సమాజం ఎందుకు గుర్తించాలి? మగవాళ్లకు పెళ్లి అయ్యిందని గుర్తించే ప్రత్యేకమైన గుర్తు ఏదీ ఉండదు కదా? ఇది కచ్చితంగా లింగ వివక్షే. సమాన హక్కుల కోసం ప్రయత్నించే క్రమంలో ఇలాంటి పాత ఆచారాలను ప్రశ్నించడం అవసరం” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ కావడంతో, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. ఒకవైపు కొందరు నెటిజన్లు “హిందూ సంప్రదాయాలను కించపరుస్తున్నారు,” “తాళి ధరించడం ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి?” అంటూ రాహుల్, చిన్మయిపై విమర్శలు ఎక్కుపెట్టారు. అదే సమయంలో, మరికొందరు నెటిజన్లు రాహుల్ అభిప్రాయాన్ని బలంగా సమర్థించారు. “ప్రతి ఒక్కరికీ ఆలోచనా స్వేచ్ఛ ఉంది. ఇది సమాజంలో మార్పు తీసుకురావాల్సిన సమయం” అంటూ మద్దతు తెలిపారు.
భర్తకు మద్దతుగా రంగంలోకి దిగిన చిన్మయి శ్రీపాద కూడా సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. “మంగళసూత్రం స్త్రీకి భద్రతను ఇస్తుంది” అన్న ఒక నెటిజన్ కామెంట్‌కు బదులిస్తూ, “మంగళసూత్రం ఉంటే మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులను ఆపగలిగేదా? పుట్టిన శిశువులపైనా దారుణాలు జరుగుతున్నాయి. అప్పుడు ఒక మంగళసూత్రం ఎలా రక్షిస్తుంది?” అంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా విడుదల కానున్న తరుణంలో ఈ వివాదం చెలరేగడంపై సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలపై సినిమా రిలీజ్‌కు ముందు మాట్లాడటం కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
