Rahul Sipligunj: కాబోయే భార్య కోసం రాహుల్ సిప్లిగంజ్ అద్భుతమైన గిఫ్ట్.. క్రికెట్ స్టార్ సర్ప్రైజ్!
Rahul Sipligunj: ప్రముఖ సింగర్, ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 27న హరిణ్యా రెడ్డితో జరగనున్న రాహుల్ వివాహం కోసం ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. తాజాగా, సంగీత్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న నేపథ్యంలో, రాహుల్ తన కాబోయే భార్య హరిణ్యకు ఇచ్చిన ఓ అపురూపమైన బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
హరిణ్యా రెడ్డికి టీమ్‌ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ అంటే వీరాభిమానం. ఆమె ఈ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని, రాహుల్ స్వయంగా క్రికెటర్ చాహాల్‌ను తమ సంగీత్ వేడుకకు ఆహ్వానించి, హరిణ్యకు మధురానుభూతిని అందించాడు. ఊహించని విధంగా చాహాల్‌ను చూసిన హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ మర్చిపోలేని జ్ఞాపకాన్ని హరిణ్య తన సోషల్ మీడియాలో పంచుకుంది. “నా జీవితంలో ఇంత పెద్ద గిఫ్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. మా సంగీత్‌కు వచ్చి మా వేడుకను ప్రత్యేకం చేసినందుకు చాహాల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాహుల్!” అంటూ చాహాల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు రాహుల్ చేసిన ఈ స్పెషల్ ట్రీట్‌పై ప్రశంసలు కురిపిస్తూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
నవంబర్ 27వ తేదీన తెల్లవారుజామున 5 గంటల శుభముహూర్తంలో రాహుల్ – హరిణ్యల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఓ లగ్జరీ ప్యాలెస్ ఈ హై-ప్రొఫైల్ వెడ్డింగ్‌కు వేదిక కానుంది. ఈ వివాహ వేడుక రాజసంగా, అంగరంగ వైభవంగా జరగనుంది.
రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యా రెడ్డిల వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్లు సమాచారం. ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఇటీవల రాహుల్ దంపతులు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. హరిణ్యా రెడ్డి విషయానికొస్తే.. ఆమె నుడా (NUDA) చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె. గతంలో నిశ్చితార్థం సందర్భంగా కూడా రాహుల్ ఆమెకు ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి తన ప్రేమను చాటుకున్నాడు.
‘నాటు నాటు’ పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, బోనాలు, వినాయక చవితి స్పెషల్ సాంగ్స్‌తో అపారమైన క్రేజ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్.. ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టి ఆస్కార్ స్థాయి వరకు ఎదిగిన ఈ ప్రయాణంలో వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు.
