Jugaari Cross: ‘జుగారి క్రాస్’గా రాజ్ బీ శెట్టి.. కన్నడ కల్ట్ నవల ఆధారంగా క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటన
Jugaari Cross: కన్నడ సినీ పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మల్టీ-టాలెంటెడ్ స్టార్ రాజ్ బీ శెట్టి తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గురుదత్త గనిగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కరవాలి’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే, ఆయన మరో సంచలన చిత్రంలో భాగమయ్యారు. అదే ‘జుగారి క్రాస్’ (Jugaari Cross).
‘జుగారి క్రాస్’ సినిమాకు గొప్ప చరిత్ర ఉంది. ఇది కన్నడ సాహిత్యంలో ప్రముఖ రచయిత, దివంగత పూర్ణచంద్ర తేజస్వి రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా రూపొందుతోంది. గురుదత్త గనిగ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు, గురుదత్త గనిగ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘కరవాలి’ తర్వాత ఈ దర్శకుడు-నటుడి కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇదే కావడం విశేషం.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ ప్రోమోలో పుర్రెలు, రక్తం, మారణాయుధాలు వంటి భయానక విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ కథాంశాన్ని ఇది సూచిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (సచిన్ బస్రూర్) ఈ విజువల్స్‌కు అదనపు హంగునిచ్చి సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేసింది.
గురుదత్త గనిగ దర్శకత్వంలో రాజ్ బీ శెట్టి నటించిన ‘కరవాలి’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. ముఖ్యంగా, రెండు దున్నల మధ్య కాగడ పట్టుకుని నిలబడిన రాజ్ బీ శెట్టి లుక్ విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు ‘జుగారి క్రాస్’ ప్రకటనతో, విభిన్న పాత్రలు ఎంచుకునే రాజ్ బీ శెట్టి నుంచి మరో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌ను చూడవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.