Rajasthan School Girl : 9 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి.. మరి మీరు, నేను సేఫేనా?
పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు ఒక యువకుడు. ఇంట్లో సరదాగా నవ్వుతూ గుండెపోటుతో మరణించాడో పెద్దాయన. అల్లరి చేసే చిన్నారి ఉన్నట్టుండి కుప్పకూలి అనంతలోకాలకు వెళ్లిపోయింది. డాక్టర్లేమో గుండెపోటుతో మరణించిందన్నారు. జిమ్‌లో వ్యాయామం చేస్తూ చేస్తూ గుండెపోటుతో మరణించాడో ప్రముఖ నటుడు. నిద్రలోనే గుండెపోటుతో ప్రాణాలు వదిలిందో మహిళ. స్నేహితులతో మాట్లాడుతూ గుండెపోటుతో కుప్పకూలిందో యువతి..
ఒకటా.. రెండా.. ఇలా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా లాంటి వైరస్ అయితే ముక్కు, నోరు మూసుకుని మనల్ని మనం కాపాడుకోవచ్చు కానీ.. ఈ గుండెపోటు ఎప్పుడు, ఎవరికీ వస్తుందో చెప్పలేకపోతుంటే.. ఎవరు మాత్రం ఎలా తప్పించుకోగలరు.
ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగో తరగతి బాలిక..
తాజాగా రాజస్థాన్‌లో నాలుగో తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలింది. తక్షణమే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని, గుండెపోటు లక్షణాలతో మరణించిందని చెప్పారు వైద్యులు. ప్రాచి కుమావత్ ఆ చిన్నారి పేరు. రాజస్థాన్‌లోని దంతా పట్టణంలో ఉన్న ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. చాలా ఉత్సాహంగా స్కూలుకు వెళ్లింది. చలాకీగానే మార్నింగ్ ప్రేయర్‌లో పాల్గొంది. ఆ తర్వాత తరగతిలోనూ కలివిడిగానే ఉంది. మధ్యాహ్నం భోజనం చేద్దామని కూర్చున్న పాప అలాగే కిందపడిపోయింది. ఉపాధ్యాయులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
చిన్నా పెద్దా తేడా లేకుండా..
చాలా ఆరోగ్యంగా ఉన్న వారు కూడా ఉన్నట్టుండి గుండెపోటుతో మరణిస్తున్న ఉదంతాలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు అయితే.. సరైన జీవనశైలి పాటించని వారు, వ్యాయామం చేయనివారు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినే వారు, వంశపారంపర్యంగా గుండెపోటు వచ్చి మరణించారు అనే వినే వాళ్లం. ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా ఉండటం లేదు. ఆడ, మగ భేదం అస్సలే లేదు. అందరినీ కబలించివేస్తోంది గుండెపోటు.
అసలు ఎందుకు వస్తుందో కూడా తెలియడం లేదు. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. సరైన ఆహారం తినాలి, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అని డాక్టర్లు చెబుతారు. మంచి ఆరోగ్య నియమాలు పాటించే సెలబ్రిటీలు కూడా గుండెపోటుతో మరణిస్తుంటే.. డాక్టర్లు కూడా ఏం చెప్పగలరు. తీవ్ర ఒత్తిడి వల్ల గుండెపోటు వస్తుందని చెబుతారా అంటే చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతుంటే అలా ఎలా చెప్పగలరు పాపం.