Rajini Kamal: రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ కన్ఫార్మ్.. 46 ఏళ్ల తర్వాత బిగ్ స్క్రీన్‌పై లెజెండ్స్
Rajini Kamal: కోలీవుడ్‌లో రెండు దిగ్గజాలు, అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌లు 46 ఏళ్ల తర్వాత ఒకే సినిమాలో నటించబోతున్నారని సినీ వర్గాల్లో ఒక కొంతకాలంగా వినిపిస్తున్నది. తాజాగా, ఈ వార్తను స్వయంగా కమల్ హాసన్ ధృవీకరించడంతో అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ భారీ మల్టీస్టారర్‌కు ‘విక్రమ్’, ‘కూలీ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వస్తున్నాయి.
కమల్ హాసన్ ప్రకటనతో క్లారిటీ
దుబాయ్‌లో ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చారు. “నేను, రజనీ చాలా ఏళ్ల క్రితమే కలిసి సినిమా చేయాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ కల నెరవేరబోతోంది. త్వరలోనే మా ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుంది” అని కమల్ ప్రకటించారు. ఈ ప్రకటనతో కొన్ని రోజులుగా మీడియాలో ఉన్న వార్త నిజమని తేలింది. ఈ సినిమాను కమల్ హాసన్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్మించనున్నారని సమాచారం. ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది.
46 ఏళ్ల తర్వాత మళ్లీ అదే క్రేజ్
రజనీకాంత్, కమల్ హాసన్‌లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు కె. బాలచందర్. వీరిద్దరూ 1985 వరకు 15కి పైగా సినిమాల్లో కలిసి నటించారు. చివరిసారిగా 1979లో ‘అల్లవుద్దీనుం అద్భుత విళక్కుమ్’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత వీరిద్దరూ తమ తమ సినిమాలతో భారీ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడంతో వీరిని ఒకే సినిమాలో చూపించే సాహసం ఎవరూ చేయలేకపోయారు.
ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కథను వినిపించి ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారని కోలీవుడ్ మీడియా చెబుతోంది. లోకేష్ వీరిద్దరినీ కలిపి ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించనున్నారని సమాచారం. దసరాకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, నవంబర్ నాటికి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.