Rachita Ram: ‘కూలీ’లో ఆమెనే హైలెట్.. స్టార్‌డమ్‌తో రాత్రికి రాత్రే టాప్ 40లోకి రచితా రామ్
Rachita Ram: ప్రస్తుతం కోలీవుడ్ సినీ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది. అది సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలోని ఒక నటి. అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ, రచితా రామ్ పోషించిన పాత్రకు విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన ప్రశంసలు లభిస్తున్నాయి.
‘కూలీ’ సినిమా విడుదలైన తర్వాత, రజనీకాంత్ అభిమానులు సైతం లోకేష్ కనగరాజ్ అంచనాలను అందుకోలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘జైలర్’, ‘రోబో 2.0’ వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుందని భావించిన ఈ సినిమా, కనీసం 500 కోట్ల క్లబ్‌లో చేరడం కూడా కష్టమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ గందరగోళం మధ్య రచితా రామ్ తన పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించారు.
సినిమాలో ఆమె పోషించిన కళ్యాణి పాత్రలో చూపించిన విభిన్నమైన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా, క్లైమాక్స్‌లో నాగార్జున ఆమెను చంపే సన్నివేశంలో థియేటర్లలో ఈలలు, చప్పట్లు మోగాయంటే ఆమె పాత్ర ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకకు చెందిన బింధ్యా రామ్ అనే అసలు పేరున్న రచిత, 2013లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో ‘సూపర్ మచ్చి’ సినిమాతో ఆమె పరిచయమయ్యారు.
https://x.com/RachitaRamDQ/status/1958762489820139520
‘కూలీ’లో ఆమె నటనకు దక్కుతున్న ప్రశంసల నేపథ్యంలో రచితా రామ్ తాజాగా ఒక అరుదైన ఘనతను సాధించారు. ఐఎమ్‌డీబీ (IMDb) విడుదల చేసిన ‘టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్’ జాబితాలో ఆమెకు 37వ ర్యాంక్ లభించింది. గతంలో 392వ స్థానంలో ఉన్న రచితా రామ్, ఒక్క సినిమాతో ఏకంగా 350 స్థానాలు ఎగబాకి ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇదే జాబితాలో ‘కూలీ’లో నటించిన మరో హీరోయిన్ శృతి హాసన్ 44వ ర్యాంకులో ఉన్నారు. ఈ అద్భుతమైన విజయం పట్ల రచితా రామ్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ విజయంతో ఆమెకు దక్షిణాదిలో అన్ని పరిశ్రమల నుంచి అవకాశాలు క్యూ కట్టవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.