Raju Weds Rambai: నెగెటివ్ టాక్ వస్తే బట్టలిప్పుకుని తిరుగుతా.. డైరెక్టర్ ఛాలెంజ్
Raju Weds Rambai: సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ప్రచారం కల్పించడం ఈ రోజుల్లో కత్తి మీద సాములా మారింది. జనాన్ని థియేటర్లకు లేదా ఓటీటీల వైపు రప్పించడానికి దర్శకనిర్మాతలు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 21న ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్’లో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సాయిలు ఆవేశంగా మాట్లాడుతూ చేసిన ఓ ఛాలెంజ్ అందరినీ విస్తుపోయేలా చేసింది.
దర్శకుడు సాయిలు మాట్లాడుతూ.. “నేను విమానాల నుంచి స్టైలిష్‌గా దిగే హీరోల కోసం కథలు రాయలేదు. మన మట్టి వాసన తెలిసే, పల్లెటూరిలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా కథలు రాశాను. ఈ సినిమా ఒక జంట 15 ఏళ్ల పాటు అనుభవించిన నరకానికి, వారి నిజ జీవిత పోరాటానికి దర్పణం. మా సినిమా చిన్నదే కావచ్చు, కానీ దాని ఆత్మ చాలా పెద్దది” అని ఎమోషనల్ అయ్యారు. తమ టీమ్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో సినిమా చూడకుండానే నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారిపై దర్శకుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమా చూసి విమర్శిస్తే స్వీకరిస్తానని, కానీ చూడకుండానే విషం చిమ్మొద్దని కోరారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. “మా సినిమా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ సినిమా చూశాక నెగిటివ్ టాక్ వస్తే.. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ సెంటర్‌లో అందరి ముందు అర్ధనగ్నంగా తిరుగుతాను” అని బహిరంగ సవాల్ విసిరారు.
సాధారణంగా డైరెక్టర్లు తమ సినిమా బాగుంటుందని చెబుతారు కానీ, ఇలా ప్లాప్ అయితే నడిరోడ్డుపై బట్టలు విప్పుకుని తిరుగుతానని శపథం చేయడం ఇదే తొలిసారి కావచ్చు. దర్శకుడి ఆత్మవిశ్వాసం చూస్తుంటే సినిమాలో కంటెంట్ బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ నెల 21న ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో, దర్శకుడు తన ఛాలెంజ్‌లో గెలుస్తారో లేదో చూడాలి.
