Rakul Preet: రూ.400 కోట్ల ‘బడే మియా చోటే మియా’ పరాజయంతో అష్టకష్టాలు పడ్డాం.. రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన
Rakul Preet: ప్రముఖ బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ కుటుంబ నిర్మాణ సంస్థ ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్’పై ఇటీవల వచ్చిన వదంతులు, భారీ బడ్జెట్ చిత్రం ‘బడే మియా చోటే మియా’ చుట్టూ అలుముకున్న ఆర్థిక సంక్షోభంపై తొలిసారిగా స్పందించారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి అగ్ర కథానాయకులు నటించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూడటంతో, నిర్మాణ సంస్థ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు వార్తలు వచ్చాయి.
రకుల్ భర్త, నిర్మాత జాకీ భగ్నానీకి చెందిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని సుమారు ₹400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అయితే, విడుదల తర్వాత ఈ చిత్రం కేవలం ₹60 కోట్లకు అటుఇటుగా మాత్రమే వసూళ్లు చేసి, అంచనాలను అందుకోలేకపోయింది. దీనిపై తాజాగా ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, ఈ వైఫల్యం తమ కుటుంబానికి గణనీయమైన ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని అంగీకరించారు.
గతంలో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వచ్చిన మూడు చిత్రాలు కూడా ఆశించినంత విజయం సాధించకపోవడంతో, వరుసగా నష్టాలు ఎదురయ్యాయని రకుల్ వెల్లడించారు. “ఇలాంటి కష్టాలు ప్రతి నిర్మాతకూ ఎదురవుతాయి. ఒకానొక దశలో అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఇది కేవలం ఒక తాత్కాలిక దశ మాత్రమే. మేము తప్పకుండా మళ్ళీ పుంజుకుంటాం” అంటూ ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ నిర్మాణ సంస్థను మూసివేశారనే వదంతులను రకుల్ గట్టిగా ఖండించారు. మీడియాలో పరిస్థితిని కొందరు అతిగా చూపిస్తున్నారని, కంపెనీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. ‘బడే మియా చోటే మియా’ చిత్రం వైఫల్యంపై గతంలో నిర్మాత జాకీ భగ్నానీ కూడా మాట్లాడారు. భారీ పెట్టుబడిని సమకూర్చడం కోసం తాము కుటుంబ ఆస్తులను సైతం తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కంటే తక్కువే తిరిగి వచ్చిందని ఆయన అప్పుడే వివరించారు. ఈ కష్ట సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, నష్టాల నుంచి బయటపడి మళ్ళీ సినిమాలు నిర్మిస్తామనే వారి ధీమాను సూచిస్తున్నాయి.
