Peddi Movie: మెగా వారసత్వానికి 18 ఏళ్లు.. రామ్‌చరణ్‌కు ‘పెద్ది’ విషెస్.. కీలక అప్డేట్
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2007లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ చిత్రంతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో తన ప్రతిభను చాటుకున్న చరణ్, ఆ తర్వాత ‘మగధీర’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ముఖ్యంగా, ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనతో తన తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి, తన 18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈ సందర్భంగా రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ టీమ్ ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. “మా ‘పెద్ది’ 18 ఏళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం. తెరపై ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూనే బయట ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండటమే కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నారు. మాకు ఎన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలను ఇచ్చాడు. ‘పెద్ది’ సినిమా నుంచి చాలా పెద్ద సర్‌ప్రైజ్‌లు మొదలు కాబోతున్నాయి” అని చిత్ర బృందం పేర్కొంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ కథలో జన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో విడుదలైన ప్రచార చిత్రంలో ఉన్న “ఒకే పని సెసేనాకి… ఒకే నాగ బతికేనాకి… ఇంత పెద్ద బతుకెందుకు?” అనే పవర్ ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.