Ram Charan: గ్లోబల్ స్టార్ సంచలన నిర్ణయం.. ‘పెద్ది’ తర్వాత మెగా గ్యాప్.. కారణం తెలిసి ఫ్యాన్స్ ఫిదా!
Ram Charan: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి, నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్, తన వృత్తి జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మగధీర’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి, ‘రంగస్థలం’తో నటుడిగా తన సత్తా చాటిన చరణ్, ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో అత్యధిక డిమాండ్ ఉన్న నటుల్లో ఆయన ఒకరు.
ప్రస్తుతం చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ గురించి టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతోంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా తొలి పాట “చికిరి చికిరి” యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ ట్రెండింగ్‌లో ఉంది.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకోగా, పోస్ట్-ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
అయితే ఈ సినిమా పూర్తైన వెంటనే రామ్ చరణ్ సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం గర్భవతి. వారికి కవల పిల్లలు జన్మించబోతున్న నేపథ్యంలో, డెలివరీ సమయంలో ఆమె పక్కనే ఉండి, పుట్టబోయే పిల్లలతో సమయం గడపాలని చరణ్ భావిస్తున్నారట. గతంలో కుమార్తె క్లీంకార జన్మించినప్పుడు కూడా ఆయన ఇలాగే కొంత విరామం తీసుకున్నారు.
చరణ్ కెరీర్ పీక్‌లో ఉండగా తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నప్పటికీ, ఎక్కువ మంది నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. కెరీర్‌తో పాటు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని, రామ్ చరణ్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సామాజిక మాధ్యమాలలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎంత కాలం విరామం తీసుకుంటారనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
