Ram Charan New Cricket Team : RRR తో రామ్ చరణ్ క్రేజ్ ఒక్కసారిగా విశ్వవ్యాప్తం అయ్యింది. అందుకే ఆయన మార్కెట్ కు అనుగుణంగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే చెర్రీ పలు వ్యాపారాల్లో భాగస్వామి కాగా తాజాగా మరో కొత్త రంగంలోకి అడుగు పెట్టడానికి సిద్ధం అయ్యాడు. రామ్ చరణ్ గతంలో ఒక పోలో టీమ్ (గుఱ్ఱపుస్వారీ) ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ట్రూ జెట్ పేరుతో ఒక విమానయాన సంస్థను ప్రారంభించాడు.
చరణ్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగాను కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రికెట్ జట్టును కొనుగోలు చేయడానికి సిద్దమయ్యాడట. అయితే అది ఐపీఎల్ కోసం కాదు ఏపీఎల్ కోసం. ఏపీఎల్ అంటే.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్. ఆంధ్రప్రదేశ్ లోని యువ క్రికెటర్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ లీగ్ తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ లీగ్ లోని ఫ్రాంచైజీలను పలువురు వ్యాపారవేత్తలు కొనుగోలు చేశారు.
కాగా, ఈ లీగ్ లో వైజాగ్ వారియర్స్ జట్టు కూడా ఆడుతోంది. ఇప్పుడీ వైజాగ్ వారియర్స్ పైనే రామ్ చరణ్ దృష్టి పెట్టాడట. దీనికి సంబంధించి చర్చలు జరిగినట్టు సమాచారం. ఇదే విషయాన్ని వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్లు శ్రీనుబాబు, నరేంద్ర రామ్, భరణిలను మీడియా ప్రశ్నించగా.. రామ్ చరణ్ వంటి సినీ ప్రముఖుడు ఈ లీగ్ లో భాగస్వామ్యం పొందితే, యువ ఆటగాళ్లకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని అన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడిస్తామన్నారు.