Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ.. ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ అర్థం ఏంటంటే..
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి అభిమానులను ఉర్రూతలూగించే సరికొత్త అప్‌డేట్ విడుదలైంది. గ్రామీణ క్రీడా నేపథ్యంతో రూపొందుతున్న ఈ మాస్ పీరియాడిక్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించింది.
‘చికిరి చికిరి’ అంటూ సాగే ఈ తొలి పాట లిరికల్ వీడియోను నవంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు పాట టైటిల్‌లోని ‘చికిరి’ అనే పదానికి ఉన్న ప్రత్యేక అర్థాన్ని వివరిస్తూ, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు ఒక ప్రత్యేక వీడియో ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర గ్రామాల్లో, ముఖ్యంగా విజయనగరం యాసలో, “అలంకరణ అక్కర్లేని, సహజమైన అందంతో ముద్దుగా, ప్రేమగా ఉండే అమ్మాయిని” ముద్దుగా ‘చికిరి’ అని పిలుస్తారని వివరించారు. “కాటుక అక్కర్లేని ఆ కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ఆ ముక్కు… అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరిరా ఈ చికిరి” అనే లైన్ సినిమాలో వస్తుందని, కథానాయకుడు రామ్ చరణ్ (పెద్ది) హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ)ను మొదటిసారి చూసే సందర్భంలో ఈ పాట వస్తుందని బుచ్చిబాబు తెలిపారు.
బుచ్చిబాబు చెప్పిన ఈ లోతైన అర్థానికి ఏఆర్ రెహమాన్ ముగ్ధులై, వెంటనే అదే పదంపై పాటను కంపోజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ గాయకుడు మోహిత్ చౌహాన్ ఆలపించగా, బాలాజీ సాహిత్యం అందించారు.
చివర్లో విడుదలైన చిన్నపాటి టీజర్‌లో, రామ్ చరణ్ పొడవాటి జుట్టు, గడ్డంతో ఊర మాస్ లుక్‌లో, బీడీతో వేసిన ఎనర్జిటిక్ హుక్ స్టెప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటపై అంచనాలు భారీగా పెరిగాయి.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి. 2026 మార్చి 27న ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ పాట విడుదల కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
