Peddi First Song: 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్.. ‘పెద్ది’ చికిరి చికిరి రికార్డు
Peddi First Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం అవుతుండటంతో ప్రాజెక్ట్‌కు మరింత హైప్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఇటీవల మొదలయ్యాయి.
ప్రచారంలో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన మొదటి పాట ‘చికిరి చికిరి’ అనూహ్యమైన స్పందనతో కొత్త చరిత్రను లిఖించింది. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట ఏకంగా 46 మిలియన్ల (4.6 కోట్లు) వ్యూస్‌ను సాధించి రికార్డుల సునామీ సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా, భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఒక పాట 24 గంటల వ్యవధిలో ఇన్ని మిలియన్ల వ్యూస్‌ను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
నిజానికి అంతకుముందు 24 గంటల్లో నమోదైన 32 మిలియన్ల వ్యూస్ రికార్డును ఈ ‘చికిరి చికిరి’ పాట కేవలం 13 గంటల్లోనే బద్దలు కొట్టి, తన ప్రభావాన్ని చాటింది. దీంతో ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ నెం.1 స్థానంలో కొనసాగుతూ వ్యూస్ పరంగా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.
ఈ పాట వెనుక అద్భుతమైన సాంకేతిక నిపుణుల బృందం ఉంది. ఈ అద్భుతమైన జానపద-ఆధునిక మిశ్రమ గీతాన్ని ప్రముఖ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. మోహిత్ చౌహాన్ అందించిన గాత్రం, బాలాజీ అందించిన హుషారైన సాహిత్యం పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జానీ నృత్య దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించిన ఈ పాటలో రామ్ చరణ్ వేసిన మాస్ స్టెప్పులు, ఎనర్జిటిక్ డ్యాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే, జాన్వీ కపూర్ అందం, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా యూత్‌ను మెస్మరైజ్ చేశాయి. పాటలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో ‘పెద్ది’ చిత్రబృందం ప్రమోషన్స్‌ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ పాట సాధించిన అపూర్వ విజయం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.
