Peddi: మెగా పవర్ స్టార్ ‘పెద్ది’ రిలీజ్ వాయిదా పడనుందా?
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై సినీ అభిమానుల్లో రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రామీణ నేపథ్యం, బలమైన భావోద్వేగాలతో కూడిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై రామ్ చరణ్ కూడా అసాధారణమైన నమ్మకాన్ని వ్యక్తం చేయడంతో ఫ్యాన్స్ మరింత కుతూహలం చూపుతున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాతలు ఈ సినిమా విడుదల విషయంలో మొదటి నుంచీ పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు. గతంలో ప్రకటించిన విధంగానే మార్చ్ 27, 2026 న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వైరల్ కావడంతో మెగా అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు.
మార్చి చివరిలో పెద్ద సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉండటం వల్ల ‘పెద్ది’కి సోలో విడుదల తేదీ దొరకకపోవచ్చుననే కారణంతో నిర్మాతలు ఈ ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని, చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదని స్పష్టమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా మాత్రం మార్చ్ 27 తేదీకే సినిమాను విడుదల చేయాలనే పకడ్బందీ ప్లాన్‌తో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి నెలాఖరుకు అన్ని పనులు పూర్తి చేసి, సినిమాను సమయానికి ప్రేక్షకులకు అందించాలనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా, ‘పెద్ది’ నుంచి త్వరలోనే మరో క్రేజీ అప్‌డేట్ రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ‘చికిరి’ పాట అద్భుతమైన స్పందన పొందగా, త్వరలో విడుదల కానున్న రెండో పాట దానికి మించి నిలబడుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే ఈ సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌ల కోసం మెగా అభిమానులు వేచి చూస్తున్నారు.
