Ram Gopal Varma: రామ్ చరణ్‌లో మళ్లీ ఆ ‘హై ఓల్టేజీ’ చూశా.. ఆర్జీవీ ప్రశంసలు
Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే రామ్‌గోపాల్ వర్మ, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్‌లో తాను ‘హై ఓల్టేజీ’ ఎనర్జీని చూశానని ఆయన పేర్కొనడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’లోని ‘చికిరి చికిరి’ అనే పాటను ఉద్దేశిస్తూ ఆర్జీవీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో తాజాగా పోస్ట్ చేశారు. ‘హీరోను ఎలివేట్ చేయడమే డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వంటి అన్ని విభాగాల ముఖ్య ఉద్దేశం’ అని చెబుతూనే, ‘చికిరి చికిరి’ పాటలో రామ్ చరణ్ ‘రా లుక్’లో ఎనర్జిటిక్‌గా కనిపించాడని కితాబిచ్చారు.
“వందలాది డ్యాన్సర్లు, భారీ సెట్ల హంగామాపై కాకుండా, కేవలం హీరోపైనే ప్రేక్షకుల దృష్టి కేంద్రీకృతమయ్యేలా చేయడంలో దర్శకుడు బుచ్చిబాబు విజయవంతం అయ్యారు,” అని ఆర్జీవీ, దర్శకుడు బుచ్చిబాబు సానా పనితీరును ప్రత్యేకంగా కొనియాడారు. “ఒక స్టార్ తన చుట్టూ కృత్రిమ మెరుపులు ఉన్నప్పుడు కాదు, సహజంగానే ఎక్కువగా ప్రకాశిస్తాడన్న విషయాన్ని దర్శకుడు అర్థం చేసుకున్నారు” అంటూ ప్రశంసలు గుప్పించారు. ఈ పాట లింక్‌ను కూడా ఆయన తన పోస్ట్‌లో షేర్ చేశారు.
‘చికిరి చికిరి’ పాట విడుదలైన అతి తక్కువ వ్యవధిలోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ నుంచి ఇలాంటి అరుదైన ప్రశంస రావడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఇటీవల, రామ్‌గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనుకోకుండా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. దాంతో, సడెన్‌గా మెగా ఫ్యామిలీ పట్ల ఆయనలో ఇంత ప్రేమ పెరగడానికి కారణమేమిటని ఓ విలేకరి ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించగా, ‘దాని గురించి మాట్లాడేందుకు ఇది సరైన సందర్భం కాదు’ అంటూ ఆర్జీవీ సమాధానాన్ని దాటవేశారు. మొత్తంగా ‘పెద్ది’ పాటపై ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్, మెగా ఫ్యామిలీపై ఆయన వైఖరిలో వస్తున్న మార్పును సూచిస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
