RC17: RC17పై ఊపందుకున్న అంచనాలు.. సుకుమార్-చరణ్ సినిమా షూటింగ్ ఎప్పుడంటే?
RC17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్ ఇది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఆ సినిమా విడుదలైన అనంతరం, చరణ్ సుమారు రెండు నెలల విరామం తీసుకుని, సుకుమార్ సినిమా సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారట. దర్శకుడు సుకుమార్ కూడా మే 2026 నుంచి ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్‌ను మొదలుపెట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్‌ను సుకుమార్ ఇప్పటికే సిద్ధం చేసి, లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు ఒక బహిరంగ వేదికపై గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ సినిమా స్థాయిని, కథపై ఉన్న అంచనాలను అమాంతం పెంచాయి. “సుకుమార్ తన తదుపరి సినిమాలో రామ్ చరణ్ హీరో ఎంట్రీ సీన్‌ను ఎలా డిజైన్ చేస్తారో చూడడానికి ఎదురుచూస్తున్నాను” అని రాజమౌళి వ్యాఖ్యానించారు. సూచాయగా అయినా కథ లేదా కీలకమైన సీన్ గురించి తెలియకుండా రాజమౌళి లాంటి దర్శకుడు ఆ మాట అనరని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ వ్యాఖ్యలే RC 17పై ఉన్న భారీ అంచనాలకు నిదర్శనంగా నిలిచాయి.
‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో, RC 17 కచ్చితంగా ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయి అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సుకుమార్ తనదైన మార్క్ కథ, కథనంతో, చరణ్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
