Ram Charan Upasana: మెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్-ఉపాసన
Ram Charan Upasana: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల దంపతులు తమ అభిమానులకు మరో శుభవార్తను అందించారు. ఈ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ఉపాసన కొణిదెల తాజాగా ప్రకటించారు. ఈ వార్తతో మెగా ఫ్యామిలీలో, అభిమానులలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ప్రస్తుత దీపావళి తమ కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేసిందని, రెట్టింపు ఆశీర్వచనాలు లభించాయని ఉపాసన ఈ సందర్భంగా సంతోషం వ్యక్తంచేశారు. తమ ప్రేమానురాగాలు రెట్టింపు అయ్యాయని తెలుపుతూ, ఈ తీపి కబురును తెలియజేసేందుకు ఒక క్యూట్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఉపాసనకు స్వీట్లు తినిపించి, శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించడం కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, అగ్ర నటులు వెంకటేశ్, నాగార్జున దంపతులు, అలాగే కథానాయిక నయనతార దంపతులు కూడా ఉపాసనను ఆశీర్వదించారు. ఈ దృశ్యాలను బట్టి చూస్తే, ఈ శుభకార్యం దీపావళి వేడుకల సమయంలోనే జరిగిందని తెలుస్తోంది. చిరంజీవి ఇటీవల తమ నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ తారలు హాజరైన సంగతి విదితమే.
రామ్‌చరణ్, ఉపాసన కొణిదెల వివాహం 2012లో జరిగింది. దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత 2023 జూన్‌లో వీరికి పాప జన్మించింది. ఆ చిన్నారికి ‘క్లీంకార’ అని పేరు పెట్టారు.
గతంలో తమ కూతురు క్లీంకార గురించి మాట్లాడిన రామ్‌చరణ్.. చిన్నారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడంపై స్పందించారు. “నా కూతురికి ప్రైవసీని ఒక బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆమెకు తన సొంత గుర్తింపు దక్కాలని ఆశిస్తున్నాను. ఫలానా వారి పిల్లలు అని తెలియడం వల్ల స్కూల్‌లో మేం స్వేచ్ఛగా ఉండలేకపోయాం, అది కొంత భారం అనిపించింది. క్లీంకార అలా భావించకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఫొటోలు వీలైనంత వరకు షేర్ చేయడం లేదు” అని తెలిపారు.
