Upasana Bathukamma: ఢిల్లీ సీఎంతో కలిసి బతుకమ్మ ఆడిన ఉపాసన.. ఫోటోలో, వీడియోలు వైరల్
Upasana Bathukamma: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఘనంగా జరిగింది. తెలంగాణ బిడ్డలైన తెలుగు విద్యార్థులు ఢిల్లీలోని ఓ ప్రముఖ కాలేజీలో ఈ పూల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, అలాగే ప్రముఖ వ్యాపారవేత్త, మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలు కేవలం తెలుగు విద్యార్థులకే కాకుండా, స్థానికులకు కూడా తెలంగాణ సంస్కృతిని పరిచయం చేశాయి.
సంప్రదాయ తెలంగాణ దుస్తుల్లో కళాశాల విద్యార్థులు, మహిళలు పాల్గొనగా, పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో భాగంగా, అతిథులుగా వచ్చిన ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఉపాసన కొణిదెల బతుకమ్మలను నెత్తిపై ఎత్తుకుని, విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ అరుదైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం, ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన సోషల్ మీడియాలో ఈ వేడుకల ఫోటోలను షేర్ చేస్తూ, బతుకమ్మ పండుగ గొప్పతనం గురించి అద్భుతంగా వివరించారు.
“ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదు. ఇది మాతృత్వానికి, జీవానికి, ప్రకృతికి గల గౌరవానికి ప్రతీక. తెలంగాణ మహిళలు తరతరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం, భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం. ఢిల్లీలోని తెలుగు విద్యార్థులు ఇలా నిర్వహించడం అభినందనీయం. ఇలాంటివి రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేస్తాయి” అని ఆమె ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ ఉపాసన కొణిదెల రీట్వీట్ చేసి, “తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ, మాతో కలిసి బతుకమ్మ జరుపుకున్నందుకు ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖుల భాగస్వామ్యం, ముఖ్యంగా ఉపాసన కొణిదెల హాజరు కావడం ఈ వేడుకలకు మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చాయని అక్కడి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వేడుకల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
https://x.com/upasanakonidela/status/1972021267399426100
