Peddi: బుచ్చిబాబు సర్‌ప్రైజ్.. రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’ తొలి సింగిల్
Peddi: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ నుంచి మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ రానుంది. వినూత్నమైన కథాంశంతో, బలమైన భావోద్వేగాలతో కూడిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నుంచి తొలి గీతాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అయితే ఈ లాంచ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చడానికి దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక పెద్ద ప్లాన్ వేశారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత మాంత్రికుడు ఏ.ఆర్. రెహమాన్ దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ది వండర్‌మెంట్’ పేరుతో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల నవంబర్ 8న జరగనున్న ఈ భారీ సంగీత వేదికపైనే ‘పెద్ది’ తొలి సింగిల్‌ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సానా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. రెహమాన్ సంగీత ప్రదర్శన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పోస్ట్ చేస్తూనే, అదే రోజు ‘పెద్ది’ నుంచి బిగ్ అప్‌డేట్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ అనౌన్స్‌మెంట్ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, క్రీడా అంశాలతో ముడిపడిన ఈ కథాంశంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రత్నవేలు వంటి అగ్రశ్రేణి ఛాయాగ్రాహకుడు పనిచేస్తున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు బలమైన కథనం, చరణ్ నటన కలగలిసి ‘పెద్ది’ ఒక ప్యాన్-ఇండియా సెన్సేషన్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది.
