Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. దసరా కానుకగా ఫస్ట్ సింగిల్
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). సాధారణ క్రీడా నేపథ్య చిత్రాలకు భిన్నంగా, ఇందులో కథానాయకుడు ఏ ఆటనైనా ఆడగలిగే ప్రతిభా సామర్థ్యాలున్న ‘ఆటకూలీ’గా కనిపిస్తాడని సమాచారం. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా, నిర్మాణ దశ నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
తాజా సమాచారం ప్రకారం, దసరా పండుగ సందర్భంగా ‘పెద్ది’ నుంచి తొలి సాంగ్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ను రామ్ చరణ్, నాయిక జాన్వీ కపూర్ లపై చిత్రీకరించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దసరా నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్‌తో పాటు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా, ఈ చిత్రంతో మరోసారి తన ప్రతిభను చాటుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్న ఈ సినిమా, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
కాగా.. పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్‌తో మూవీ చేయాలని ‘పుష్ప 2’తో రికార్డు విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ ఒక పెద్ద విజయాన్ని సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్, రామ్ చరణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా ఒక యాక్షన్ డ్రామానే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ ‘రంగస్థలం’ కంటే చాలా భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.