Ram Gopal Varma: పైరసీ చూసేవాళ్లను అరెస్ట్ చేయాలి.. ‘ఐబొమ్మ’ వ్యవహారంపై ఆర్జీవీ కామెంట్స్
Ram Gopal Varma: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఏ విషయంపైనైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వర్మ, తాజాగా తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న ‘ఐబొమ్మ’ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిశ్రమ ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం సైట్ నిర్వాహకులను అరెస్ట్ చేస్తే సరిపోదని, అసలు సమస్య వేరే చోట ఉందని వర్మ తన సోషల్ మీడియా వేదికగా విశ్లేషించారు.
పైరసీ అనేది టెక్నాలజీ వల్లనో, పోలీసుల వైఫల్యం వల్లనో జరుగుతున్న నేరం కాదని వర్మ అభిప్రాయపడ్డారు. కేవలం ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్నంత కాలం, రవి లాంటి వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారని ఆయన తేల్చిచెప్పారు. “రాబిన్ హుడ్ అనేవాడు హీరో కాదు, అతనో టెర్రరిస్ట్.. ధనవంతుల దగ్గర దోచుకోవడం అనేది గొప్ప పనేమీ కాదు” అంటూ ఐబొమ్మ నిర్వాహకుడిని వెనకేసుకొస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
సినిమా టికెట్ల ధరలు, థియేటర్లో పాప్‌కార్న్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లే తాము పైరసీ చూస్తున్నామని చెప్పే వారి లాజిక్‌ను వర్మ ఎండగట్టారు. “రేట్లు ఎక్కువైతే దొంగతనం చేయడం కరెక్ట్ కాదు. రేపు బీఎండబ్ల్యూ కారు రేటు ఎక్కువగా ఉందని షోరూమ్‌ను లూటీ చేస్తారా? బంగారం ధర ఆకాశాన్ని తాకుతోందని జ్యువెలరీ షాపుల్లో దొంగతనం చేస్తారా?” అంటూ వర్మ సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇలాంటి విపరీతమైన లాజిక్‌లు సమాజంలో అరాచకానికి దారి తీస్తాయని ఆయన హెచ్చరించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తన సౌలభ్యం కోసం తాను కూడా అప్పుడప్పుడు పైరసీ కంటెంట్ చూస్తానని వర్మ ఓపెన్‌గా అంగీకరించారు. మనుషుల్లో మార్పు రావాలంటే నైతిక విలువలు చెప్తే సరిపోదని, భయం మాత్రమే పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పైరసీని నిజంగా అరికట్టాలంటే కంటెంట్ అందించే వాళ్ళను మాత్రమే కాదు, దానిని చూసే వాళ్ళను కూడా నేరస్తులుగా చూడాలన్నారు. “పైరసీ చూస్తున్న ఒక 100 మందిని అరెస్ట్ చేసి, వారి పేర్లను మీడియాలో బహిరంగంగా ప్రకటిస్తే.. అప్పుడు జనాల్లో భయం పుడుతుంది. అప్పుడే పైరసీ ఆగుతుంది” అని వర్మ తనదైన మార్క్ సొల్యూషన్ చెప్పారు. మొత్తానికి వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
