Ramayana: రాముడి పాత్ర కోసం మద్యపానం, మాంసాహారం మానేసిన రణబీర్ కపూర్..
Ramayana: భారతీయ పురాణ ఇతిహాసం రామాయణం ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’. దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ఈ వెయ్యికోట్ల ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రాముడి పాత్ర పోషిస్తున్న హీరో రణబీర్‌కపూర్, ఆ పాత్రకు న్యాయం చేసేందుకు తన జీవన శైలిలో అనేక మార్పులు చేసుకున్నారు.
రాముడి పాత్ర పవిత్రతను దృష్టిలో ఉంచుకొని రణబీర్‌కపూర్ కొన్ని కఠిన నియమాలను పాటిస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మద్యం జోలికి వెళ్లనని ఆయన శపథం చేశారట. అంతేకాకుండా, పూర్తిగా శాఖాహారిగా మారి, సాత్వికాహారం మాత్రమే తీసుకుంటున్నారని తెలిసింది. ఈ మార్పు ఆయన పాత్ర పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
ఇప్పటికే సినిమా చిత్రీకరణ సగం పూర్తయింది. రణబీర్‌తో పాటు సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. శారీరక, మానసిక ప్రశాంతత కోసం రణబీర్ యోగా, ధ్యానం వంటివి కూడా సాధన చేస్తున్నారట. తన కూతురు రహా పుట్టిన తర్వాత తాను స్మోకింగ్ పూర్తిగా మానేశానని, ఇప్పుడు ‘రామాయణ’ సెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తి శాఖాహారిగా మారిపోయానని రణబీర్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్, దాని గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. వెయ్యికోట్ల బడ్జెట్, భారీ తారాగణం, రణబీర్ వంటి స్టార్ హీరో అంకితభావం.. ఇలా అన్ని అంశాలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
దాదాపు రూ. 4,000 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే, సన్నీ దేవోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నట్టు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ప్రపంచం భారతీయ సినిమాలను చిన్నచూపు చూసినప్పుడు తాను నిరాశపడ్డానని, ‘రామాయణ’తో ఆ పరిస్థితి మారుతుందని నమిత్ మల్హోత్రా గతంలోనూ తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ చిత్రం కేవలం కథ చెప్పడం మాత్రమే కాదు, ప్రపంచానికి భారతీయ సంస్కృతి, పురాణాల గొప్పతనాన్ని తెలియజేయాలనేది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఈ వ్యాఖ్యలు మరింత పెంచాయి.
