Rani-Shah Rukh: కింగ్‌కు హెల్ప్ చేసిన రాణి.. జాతీయ అవార్డుల వీడియో వైరల్..
Rani Shah Rukh: భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారాలుగా భావించే 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు తమ పురస్కారాలను అందుకున్నారు. ఈ వేడుకలో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న షారుఖ్ ఖాన్, ఉత్తమ నటిగా నిలిచిన రాణీ ముఖర్జీ మధ్య చోటుచేసుకున్న ఆత్మీయ క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది.
షారుఖ్ తన అవార్డు మెడల్‌ను వేసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా, పక్కనే కూర్చున్న రాణీ ముఖర్జీ వెంటనే గమనించి అతడికి సాయం చేసింది. మెడల్‌ను సరిచేసి, షారుఖ్ మెడలో స్వయంగా వేసింది. ఆ తర్వాత, తమ ఫోన్‌లలో సెల్ఫీలు తీసుకుంటూ ఆ సంతోష క్షణాలను పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ అభిమాన నటులు ఇలా ఒకరినొకరు సాయం చేసుకోవడం చూసి అభిమానులు ముగ్ధులయ్యారు.
ఈసారి జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా తనదైన ముద్ర వేసింది. చిన్న సినిమాలైన ‘బేబి’, ‘బలగం’, ‘హనుమాన్’ వంటి చిత్రాలు కీలక విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుని తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాయి.
‘బేబి’ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’ పాటకు పీవీఎన్ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, అలాగే ఈ చిత్రానికి సాయి రాజేష్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే రచయితగా పురస్కారాలు అందుకున్నారు.
‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల శ్యామ్ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.
‘హనుమాన్’ చిత్రానికి జెట్టి వెంకట్ కుమార్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు గెలుచుకున్నారు.
‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికి సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ బాలనటిగా ఎంపికయ్యారు.
https://www.instagram.com/reel/DO9D0P3krON/?utm_source=ig_embed&ig_rid=9fb20360-a3f2-4d81-a95c-63a52f06bade
’12th ఫెయిల్’ చిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నిలవగా, ఇందులో నటించిన విక్రాంత్ మాస్సే, ‘జవాన్’ చిత్రానికి గాను షారుఖ్ ఖాన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకున్నారు. ఇక, రాణీ ముఖర్జీ ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రానికి ఉత్తమ నటిగా పురస్కారం అందుకున్నారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు లభించింది.
