Rani Mukerji: జాతీయ అవార్డుల వేదికపై వైరల్ అయిన ఆ నెక్లెస్.. కూతురిపై రాణీ ముఖర్జీ ప్రేమకు ఫిదా కావాల్సిందే
Rani Mukerji: భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ చలన చిత్ర పురస్కారాల (National Film Awards) వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె తన మెడలో ధరించిన ఒక చైన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనికి కారణం, ఆ గొలుసుపై ఆమె ముద్దుల కుమార్తె అదిరా పేరు రాసి ఉండటమే.
తాజాగా, రాణీ ముఖర్జీ ఆ చైన్ ఎందుకు ధరించిందో చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు తన కుమార్తె అదిరాను వెంట తీసుకురావాలని తాను ఎంతగానో ఆశ పడ్డానని, కానీ, జాతీయ అవార్డుల కార్యక్రమానికి 14 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి లేకపోవడంతో ఆమె రాలేకపోయిందని రాణి వివరించారు.
“నేను అవార్డు అందుకుంటున్న ఆ అద్భుత క్షణాన్ని చూడాలని అదిరా చాలా ఆశపడింది. నాకెంతో ప్రత్యేకమైన ఆ రోజున ఆమె నా పక్కన ఉండలేకపోయింది. అందుకే, నా కుమార్తె నా అదృష్టం కాబట్టి, ఆమె పేరు మీద ప్రత్యేకంగా చైన్ తయారు చేయించుకుని ధరించాను. అదిరా నా వెంటే ఉన్నట్టు నాకు అనిపించడం కోసమే ఇలా చేశాను” అని రాణీ ముఖర్జీ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు.
సోషల్ మీడియాలో ‘రాణి తన కుమార్తెను వెంట తీసుకువెళ్లారు’ అంటూ ఆ గొలుసును హైలైట్ చేస్తూ అనేక రీల్స్, వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిని చూసిన అదిరా చాలా ఆనందపడిందని, ఆ వీడియోలు రూపొందించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
రాణి ముఖర్జీ 2023లో విడుదలైన ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రంలో అద్భుత నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వేడుక కోసం ఆమె సబ్యసాచి డిజైన్ చేసిన సంప్రదాయ పట్టు చీరలో హాజరయ్యారు.