Dhurandhar: రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ఆరు దేశాల్లో బ్యాన్.. కారణం ఏంటంటే?
Dhurandhar: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, నటుడు మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ ఆదరణ దక్కించుకుంది. అయితే ఈ చిత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘ధురంధర్’ సినిమాను ఆరు కీలకమైన గల్ఫ్ దేశాల్లో నిషేధించారు. భారతదేశ చిత్రాలకు ముఖ్యమైన మార్కెట్ అయిన గల్ఫ్ రీజియన్‌లో ఈ నిర్ణయం నిర్మాతల పాలిట పెద్ద షాక్‌గా మారింది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈతో సహా ఆరు గల్ఫ్ దేశాలలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేసినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.. ఈ చిత్రం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించబడి ఉండవచ్చునని తెలుస్తోంది. పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న సున్నితమైన అంశాలను సినిమాలో ప్రస్తావించడం వల్లే ఈ దేశాలు దీనిపై నిషేధం విధించాయని సమాచారం. నిర్మాణ సంస్థ గల్ఫ్ రీజియన్‌లోని అన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నించినా, కొన్ని ప్రాంతాలలో అనుమతులు కూడా లభించకపోవడంతో కొన్ని థియేటర్లకు మాత్రమే పరిమితం చేయాల్సి వచ్చింది. చివరకు, మొత్తం ఆరు దేశాలలో దీని ప్రదర్శన ఆగిపోయింది.
గల్ఫ్ దేశాలలో ఈ షాక్ తగిలినా, దేశీయంగా ‘ధురంధర్’ విజయ పరంపర కొనసాగుతోంది. భారీ నిడివి ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్, దాదాపు 17 ఏళ్ల తర్వాత బాలీవుడ్ నుంచి వస్తున్న అతిపెద్ద సినిమాల్లో ఒకటిగా విడుదలైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, కేవలం వారంలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధమవుతోంది. రణ్‌వీర్ సింగ్, మాధవన్ నటన, ఆదిత్య ధర్ దర్శకత్వం ప్రేక్షకులను కట్టిపడేయడంతో, ‘ధురంధర్’ దేశీయంగా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తోంది.
