Rashmika Mandanna: ‘కాంతార’ ట్రోల్స్‌పై రష్మిక కౌంటర్.. వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందు పెట్టలేనంటూ..
Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటి రష్మికా మందన్న ప్రస్తుతం ఆరుకు పైగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘పుష్ప 2’, ‘యానిమల్’, ‘ఛావా’ వంటి బడా సినిమాలతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. కన్నడలో ‘కిరిక్ పార్టీ’తో కెరీర్ మొదలుపెట్టిన రష్మిక, ఇప్పుడు భాషా సరిహద్దులను చెరిపేసి అన్ని ఇండస్ట్రీలలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే, ఇటీవల కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా విజయవంతమవుతున్న సమయంలో, రష్మికా సోషల్ మీడియాలో చేసిన ఒక కామెంట్‌పై భారీగా ట్రోలింగ్ జరిగింది. కొందరు నెటిజన్లు ఆమెను “కన్నడ పరిశ్రమను మర్చిపోయింది” అని, విజయవంతమైన తమ సినిమాను పట్టించుకోలేదని విమర్శించారు.
తాజాగా, ఈ వివాదంపై రష్మిక ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. “ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే, ఒకే రోజులో చూడటం సాధ్యం కాదు. నేను ‘కాంతార’ సినిమాను కూడా విడుదలైన రెండు, మూడు రోజుల తర్వాతే చూడగలిగాను. సినిమా చూసిన వెంటనే చిత్రబృందాన్ని అభినందించాను. వారు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు” అని రష్మికా స్పష్టం చేశారు.
అంతేకాకుండా, “తెర వెనుక ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియదు. నా వ్యక్తిగత జీవితాన్ని కెమెరా ముందు తీసుకొచ్చి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు” అని ఆమె గట్టిగా చెప్పారు. తనపై అబద్ధపు ప్రచారం చేయొద్దని కోరారు. “ప్రజలు నా నటన గురించి, నా పని గురించి ఏమనుకుంటారు అనేదే నాకు ముఖ్యం. దయచేసి నా వ్యక్తిగత విషయాలపై తప్పుడు ప్రచారం చేయవద్దు” అని ట్రోలర్లకు రష్మిక కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం రష్మికా మందన్న చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.