Rashmika: విజయ్‌ని పెళ్లి చేసుకుంటా.. ఎట్టకేలకు ప్రకటించిన నేషనల్ క్రష్
Rashmika: తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస విజయాలతో జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న అగ్ర కథానాయిక రష్మిక మందన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయంపై ఆమె స్పష్టంగా వెల్లడించడమే కాకుండా, తన ప్రియమైన వ్యక్తి, యువ సంచలనం విజయ్ దేవరకొండతో పెళ్లి గురించి కూడా తొలిసారిగా సంకేతాలు ఇచ్చారు.
ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మిక, తన వ్యక్తిగత జీవితంపై అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా, ఆమె కోరుకునే జీవిత భాగస్వామి లక్షణాల గురించి అడిగినప్పుడు, రష్మిక చెప్పిన సమాధానం అందరినీ ఆకర్షించింది.
రష్మిక మాట్లాడుతూ, “నాకు జీవితంలో నిజాయితీగా, నన్ను లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా నా దృక్కోణం నుంచి ఆలోచించి అర్థం చేసుకునే గుణం ఉండాలి. అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే, ఎలాంటి దాన్నైనా అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని నేను కోరుకుంటున్నాను,” అని తెలిపారు.
అంతేకాక “ముఖ్యంగా, అతనికి మంచి వ్యక్తిత్వం ఉండాలి. ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉన్నా సరే, నా కోసం యుద్ధం చేయగల వ్యక్తిత్వం ఉన్న భర్త కావాలి. అలాంటి భాగస్వామి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే ఆ యుద్ధంలో తూటాకైనా ఎదురెళ్తాను,” అంటూ రష్మిక చెప్పిన మాటలు ఆమెకు తన భాగస్వామిపై ఉన్న అంచనాలను, బంధంపై ఆమెకున్న బలమైన నమ్మకాన్ని తెలియజేశాయి.
ఇక మరొక అభిమాని ‘మీరు ఎవరితో డేట్ చేస్తారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు?’ అని అడగ్గా, రష్మిక చిరునవ్వుతో సమాధానమిచ్చారు. “డేట్ విషయానికొస్తే, నాకు చాలా ఇష్టమైన యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో చేస్తాను. కానీ, పెళ్లి చేసుకుంటే మాత్రం… విజయ్‌నే చేసుకుంటా,” అని రష్మిక బదులిచ్చారు. ఆమె ఈ సమాధానం చెప్పగానే స్టూడియోలో ఉన్న ఆడియెన్స్ అంతా పెద్ద ఎత్తున కేకలు వేసి అభినందనలు తెలిపారు.
గత కొన్ని నెలలుగా రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 3న వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగిందని కూడా ప్రచారం జరిగింది. ఆ వార్తలపై రష్మిక ఇంతకుముందు పరోక్షంగా స్పందించినా, ఇప్పుడు విజయ్‌తో పెళ్లి విషయాన్ని బహిరంగంగా చెప్పడం… గత ప్రచారానికి బలం చేకూర్చింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ విధంగా తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పిన రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె అభిమానులను, సినీ ప్రేక్షకులను మరింత సంతోషానికి గురిచేస్తున్నాయి.
