Bhartha Mahasayulaku Wignyapthi: రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో సాంగ్ అప్‌డేట్.. ‘అద్దం ముందు’ ప్రోమో ఎప్పుడంటే?
Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం దర్శకుడు కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ 76వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ‘అమిగోస్’ ఫేమ్ ఆషికా రంగనాథ్, ‘ఖిలాడి’ ఫేమ్ డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ‘బెల్లా బెల్లా’ అనే మొదటి పాట మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి రెండవ సింగిల్ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ పాట టైటిల్ ‘అద్దం ముందు’. ‘అద్దం ముందు’ పాట ప్రోమోను డిసెంబర్ 10న సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రవితేజ, డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ సాంగ్ సూపర్ కూల్ రొమాంటిక్ ట్రాక్‌గా ఉండబోతున్నట్లు తాజాగా విడుదలైన లుక్ స్పష్టం చేస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని తెలుస్తోంది.
ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, కచ్చితమైన విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సినిమా పక్కా ఫ్యామిలీ టచ్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టైటిల్ గ్లింప్స్ ద్వారానే అర్థమవుతోంది. టైటిల్ గ్లింప్స్‌లో.. “భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాళ 10:30 నిమిషాలకు స్వామి వారి కల్యాణం. అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది” అంటూ ఒక పంతులు వాయిస్ ఓవర్‌తో అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది.
ఆ తర్వాత రవితేజ వాయిస్ ఓవర్‌తో… “ఈ అనౌన్స్‌మెంట్ మనలో చాలా మంది చాలా సార్లు విని ఉంటాం. ఇప్పుడు నాకిది ఎందుకు గుర్తొచ్చిందంటే నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, జెమినీ, చాట్ జీపీటీ ఇలా అన్నింటిని అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా అయోమయానికి గురిచేశాయి” అంటూ సాగే మాటలు సినిమా కథపై, ముఖ్యంగా పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య వచ్చే సన్నివేశాలపై ఆసక్తిని రెట్టింపు చేశాయి.