Ravi Teja: మాస్ మహారాజా – శివ నిర్వాణ కాంబో ఫిక్స్! ‘ఇరుముడి’గా టైటిల్..
Ravi Teja: ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి విజయాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు శివ నిర్వాణ, చివరి చిత్రం ‘ఖుషి’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొంచెం నెమ్మదించారు. ప్రస్తుతం, ఆ గ్యాప్‌ను పూడుస్తూ, ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన మాస్ మహారాజా రవితేజతో కలిసి పనిచేయనున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ త్వరలో అధికారికంగా ప్రకటించడానికి రంగం సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన కోలీవుడ్ నటి ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటించనున్నారు. అత్యంత ఆసక్తికరంగా, ఈ సినిమా ఒక థ్రిల్లర్ జానర్లో రూపొందనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఈ చిత్రానికి సంబంధించి సినీ వర్గాల్లో ఒక సెన్సిటివ్ టైటిల్ చర్చనీయాంశమైంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కూతురిని కాపాడుకునే క్రమంలో ఒక తండ్రి పడే తాపత్రయం, పోరాటం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. ఈ కథాంశానికి ‘ఇరుముడి’ అనే టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా ఆ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రవితేజ, శివ నిర్వాణ… ఇద్దరికీ ఈ కొత్త సినిమా చాలా కీలకం. కొంతకాలంగా వారిద్దరూ ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్స్ అందుకోలేకపోయారు. అందుకే, ఈ ‘ఇరుముడి’ చిత్రం ద్వారా భారీ విజయాన్ని సాధించి, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం వారికి ఎంతైనా ఉంది. శివ నిర్వాణ తన మార్కు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో థ్రిల్లర్ అంశాలను ఎలా మిళితం చేస్తారో చూడాలి.
