Mass Jathara Teaser: నాకంటూ ఓ చరిత్ర ఉంది.. అలరిస్తున్న రవితేజ ‘మాస్ జాతర’ టీజర్
Mass Jathara Teaser: మాస్ మహారాజ్ రవితేజ 75వ మూవీ ‘మాస్ జాతర’ టీజర్ విడుదలైంది. అభిమానులకు పండగ వాతావరణం తీసుకొస్తూ, ఆయన 75వ చిత్రం ‘మాస్ జాతర’ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలీల కథానాయికగా అలరించనుంది. ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
రవితేజ మార్క్ ఎనర్జీ..
రవితేజ ఎప్పటిలాగే తన మార్క్ మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇందులో ఆయన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. రైల్వే పోలీస్‌గా ఆయన చేసే విన్యాసాలు, చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌లు టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా, “నాకంటూ ఓ చరిత్ర ఉంది..” అనే డైలాగ్ అభిమానుల చేత ఈలలు వేయించేలా ఉంది. ఈ సినిమాలో రవితేజ నుంచి ఫ్యాన్స్ ఆశించే కామెడీ, యాక్షన్, రొమాన్స్ వంటి అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని టీజర్ స్పష్టం చేస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గత కొంతకాలంగా రవితేజ సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఈ సినిమా ఆయనకు ఒక బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఆగస్టు 27న సినిమా విడుదలయ్యాక ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
కాగా.. గత వారం మాస్ జాతర నుంచి విడుదలైన రెండో పాటపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. భాస్కర్ యాదవ్ రచించిన ఈ పాటలో కొన్ని పదాలు అనుచితంగా ఉన్నాయని, బూతులు ధ్వనిస్తున్నాయని ఒక వర్గం ప్రేక్షకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా, ‘నీ అమ్మని.. అక్కని..’ వంటి పదాలు వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయని, ఇలాంటి పదాలను సినిమాల్లో వాడటం సరికాదని విమర్శిస్తున్నారు. ఈ పాటలో నీ అమ్మ.. అక్క.. తల్లి.. చెల్లిని.. పట్టుకుని.. ఉంట నీ అమ్మ కాడా, తింటా నీ అమ్మ కాడా.. నీ దగ్గర పంట.. వంటి పదాలు ఉన్నాయి. ఈ పాటలు సమాజంపై తప్పుడు ప్రభావం చూపుతాయని నెటిజన్లు ఫైర్ అయ్యారు.