Mass Jathara: రవితేజ అభిమానులకు నిరాశ.. ‘మాస్ జాతర’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనిపై చిత్ర నిర్మాతలు ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
‘మాస్ జాతర’ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. వాయిదాకు గల కారణాలను వివరిస్తూ, సినీ పరిశ్రమలోని సమ్మెలతో పాటు, మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదని చిత్ర బృందం పేర్కొంది.
“సినిమా ఆలస్యమైనప్పటికీ, ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదం అందించడమే మా లక్ష్యం. ఈ సినిమా పూర్తయ్యాక భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తాం,” అని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని కూడా వారు హామీ ఇచ్చారు.
ఈ చిత్రంలో రవితేజ ఒక రైల్వే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చిత్ర విడుదల వాయిదా పడటంపై వారు కాస్త నిరాశ చెందుతున్నప్పటికీ, నాణ్యమైన సినిమా కోసం ఎదురుచూసేందుకు సిద్ధంగా ఉన్నారు.
https://x.com/SitharaEnts/status/1960221857912955009
కాగా.. ఇటీవల మాస్ జాతర మూవీ నుంచి విడుదలైన పాట చుట్టూ వివాదం రేగిన విషయం తెలిసిందే. భాస్కర్ యాదవ్ రచించిన ‘ఓలే ఓలే’ పాటలో కొన్ని పదాలు అనుచితంగా ఉన్నాయని, బూతులు ధ్వనిస్తున్నాయని ఒక వర్గం ప్రేక్షకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ‘నీ అమ్మని.. అక్కని..’ వంటి పదాలు వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నాయని, ఇలాంటి పదాలను సినిమాల్లో వాడటం సరికాదని విమర్శించారు. ఈ పాటలో నీ అమ్మ.. అక్క.. తల్లి.. చెల్లిని.. పట్టుకుని.. ఉంట నీ అమ్మ కాడా, తింటా నీ అమ్మ కాడా.. నీ దగ్గర పంట.. వంటి పదాలు ఉన్నాయి. ఈ పాటలు సమాజంపై తప్పుడు ప్రభావం చూపుతాయని పలువురు నెటిజన్లు రచయితపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
