Prabhas: ‘ది రాజాసాబ్’కు కీలక అప్డేట్.. ఆ షెడ్యూల్స్ పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో శుభవార్త. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, ఈ నెలలో కీలకమైన షెడ్యూల్స్ పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 18 నుంచి కేరళలో ప్రారంభం కానుంది. దాదాపు వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యాలు అందించనున్నారు. అనంతరం, అక్టోబర్‌లో గ్రీస్‌లో మరో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్‌లో మూడు పాటలను చిత్రీకరించనున్నారు. వీటితో సినిమా దాదాపుగా పూర్తవుతుందని సమాచారం.
‘ది రాజాసాబ్’ ఒక రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇందులో ప్రభాస్ రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చేపట్టింది. ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, మొదటి ట్రైలర్‌ను అక్టోబర్‌లో విడుదల కానున్న కన్నడ సినిమా ‘కాంతార: చాప్టర్ 1’ తో పాటుగా ప్రదర్శించనున్నారు. అలాగే, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అప్‌డేట్ కూడా ఉంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
కాగా.. సినిమాలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలిచే రాజ్ మహల్ సెట్‌ను రూ. 7 కోట్లకు పైగా వ్యయంతో ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ నిర్మించారు. ఈ భారీ సెట్ సినిమాకి సరికొత్త లుక్ తీసుకొస్తుందని చిత్ర బృందం పేర్కొంది. అంతేకాకుండా, ‘రాజా సాబ్ 2’ కూడా ఉంటుందని నిర్మాత చెప్పడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.