Dinosaur Fossil Auction: అరుదైన డైనోసార్ శిలాజం రికార్డు ధరకు విక్రయం..
Dinosaur Fossil Auction: న్యూయార్క్‌లో జరిగిన ఒక అరుదైన వేలంలో పురాతన డైనోసార్ శిలాజం రికార్డు ధర పలికింది. సుమారు 150 మిలియన్ సంవత్సరాల నాటి ఈ సెరాటోసారస్ శిలాజాన్ని ఒక వ్యక్తి ఏకంగా 30.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.263 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన డైనోసార్ అస్థిపంజరాలలో ఇది మూడవది కావడం గమనార్హం.
ఈ వేలం న్యూయార్క్‌లోని సోథిబే వేలం సంస్థ నిర్వహించింది. ముక్కు మీద కొమ్ము, పదునైన దంతాలు, వెనుక, తోక భాగాలలో ఎముకల కవచం కలిగిన మాంసాహార డైనోసార్ అయిన సెరాటోసారస్ శిలాజం, ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ధరకు అమ్ముడైంది. దీని విలువ 4 నుండి 6 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేసినప్పటికీ, ఆరుగురు బిడ్డర్ల పోటీతో ధర భారీగా పెరిగింది.
ఈ అరుదైన శిలాజాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను సోథిబే భద్రతా కారణాల రీత్యా వెల్లడించలేదు. అయితే, సదరు కొనుగోలుదారు ఈ శిలాజాన్ని ఒక మ్యూజియానికి అప్పుగా ఇవ్వాలని యోచిస్తున్నారని సోథిబే తెలిపింది. ఈ విషయంపై ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన డైనోసార్ నిపుణుడు ప్రొఫెసర్ స్టీవ్ బ్రుసాట్టే ఆందోళన వ్యక్తం చేశారు. డైనోసార్ శిలాజాలకు ఇంత భారీ ధరలు పలకడం దిగ్భ్రాంతికరమని, మ్యూజియాలు ఇటువంటి ధరలను భరించలేవని ఆయన అభిప్రాయపడ్డారు.
శిలాజం ప్రత్యేకతలు
ఈ సెరాటోసారస్ శిలాజం ప్రత్యేకమైనది. ప్రపంచంలో తెలిసిన నాలుగు సెరాటోసారస్ శిలాజాలలో, ఇది ఏకైక చిన్న సెరాటోసారస్ శిలాజం. ఇది 6 అడుగుల ఎత్తు, 10 అడుగులకు పైగా పొడవు కలిగి, 139 ఎముకలను కలిగి ఉంది. ఇదే వేలంలో అంగారక గ్రహం నుంచి తీసుకొచ్చిన అతిపెద్ద ఉల్కాపాతం కూడా 5.3 మిలియన్ డాలర్లు (రూ.45 కోట్లు) పలికింది. గత ఏడాది జూలైలో జరిగిన వేలంలో ‘అపెక్స్’ అనే స్టెగోసారస్ శిలాజం 44.6 మిలియన్ డాలర్లు (రూ.380 కోట్లు) పలికింది.