RGV Show Man: ఊర మాస్ లుక్‌లో ఆర్జీవీ.. ఇదిఎవరూ ఊహించి ఉండరు.. ‘షో మ్యాన్’ ఫస్ట్ లుక్
RGV Show Man: ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఈసారి ఏకంగా హీరోగా మారి ప్రేక్షకులను షాక్‌కు గురిచేశారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం ‘షో మ్యాన్’ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘మ్యాడ్ మాన్‌స్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో, పక్కా గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.
ఈ ఫస్ట్ లుక్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గుబురు గెడ్డం, పవర్ ఫుల్ మాస్ ఆటిట్యూడ్‌తో పూర్తి రగ్గడ్ లుక్‌లో ఉన్న ఆర్జీవీని చూసి, “ఇది నిజంగానే రామ్ గోపాల్ వర్మా?” అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడిగా ఎన్నో సంచలనాలు సృష్టించిన వర్మ, హీరోగా తన ఎంట్రీతోనే అదరగొట్టేశాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో సీనియర్ నటుడు సుమన్ నటిస్తుండడం విశేషం. రజనీకాంత్ చిత్రం ‘తలైవా’లో ఆదిశేషుగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సుమన్, ఇప్పుడు ఆర్జీవీతో విలన్‌గా ఢీ కొట్టడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు నూతన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ భీమవరం టాకీస్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్‌పై గతంలో వర్మతో కలిసి ‘ఐస్ క్రీమ్ 1’, ‘ఐస్ క్రీమ్ 2’ చిత్రాలను నిర్మించారు.
తాజాగా షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని టీమ్ ప్రకటించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘షో మ్యాన్’తో దర్శకుడిగా ఎన్నో సెన్సేషన్లు సృష్టించిన ఆర్జీవీ, హీరోగా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
