Jai Hanuman Movie: అవెంజర్స్‌ను గుర్తుకుతెచ్చేలా జై హనుమాన్.. గట్టిగా ప్లాన్ చేసిన ప్రశాంత్ వర్మ
Jai Hanuman Movie: కన్నడ సంచలనం, నటుడు రిషబ్‌శెట్టి అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ‘హనుమాన్’ చిత్రంతో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జై హనుమాన్’ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రిషబ్‌శెట్టి పౌరాణిక పాత్ర అయిన హనుమంతుడిగా కనిపించనున్నారు.
రిషబ్‌శెట్టి హనుమంతుడి పాత్రలో ఉన్న ఫస్ట్‌లుక్ స్టిల్స్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవలే విడుదలైన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న రిషబ్, ఇప్పుడు ఆ సినిమా హడావిడి ముగియడంతో పూర్తి దృష్టిని ‘జై హనుమాన్’పై పెట్టారు.
తాజా సమాచారం ప్రకారం, ‘జై హనుమాన్’ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలుకానుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ అండ్ టీమ్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి, షూటింగ్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌తో సిద్ధంగా ఉంది. రిషబ్‌శెట్టి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే చిత్రీకరణ ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది.
‘జై హనుమాన్’ ఒక కల్పిత కథాంశంతో, సంభ్రమాశ్చర్యాలకు లోను చేసేలా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ కథ, కథనాలు హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘అవెంజర్స్’ వంటి చిత్రాలను తలపించేలా ఉంటాయని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరచనుంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగమైన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.