Rishab Shetty: కాంతార షూటింగ్‌లో నాలుగుసార్లు ప్రాణాలు పోయేవి.. రిషబ్ శెట్టి కామెంట్స్
Rishab Shetty: సినీ పరిశ్రమలో ఎంతోమంది అదృష్టం, కృషి, పట్టుదలతో రాణిస్తుంటారు. అయితే, మరికొందరికి మాత్రం దైవబలం తోడైతేనే అద్భుతాలు సృష్టిస్తారు. ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో కీర్తి ప్రతిష్టలు అందుకున్న నటుడు రిషబ్ శెట్టికి దైవబలంపై ఉన్న నమ్మకం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కోసం పడిన కష్టం, ఎదురైన సవాళ్ళ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా నాలుగుసార్లు తన ప్రాణాలు పోయేవని, ఆ సమయంలో దేవుడే తనను కాపాడారని ఆయన తెలిపారు.
తాజాగా జరిగిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో రిషబ్ శెట్టి, హీరోయిన్ రుక్మిణి వసంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిషబ్ మాట్లాడుతూ, “కాంతార సినిమా షూటింగ్ సమయంలో నాకు నాలుగుసార్లు పెద్ద ప్రమాదాలు జరిగాయి. అప్పుడు నేను చనిపోయి ఉండేవాడినే. ఆ దైవం నాపై చూపిన కరుణ, ఆశీస్సుల వల్లే నేను ఈ రోజు మీ ముందు నిలబడ్డాను. ఆయన ఆశీస్సులు లేకపోతే ఈ సినిమా పూర్తయ్యేది కాదు” అని ఎమోషనల్ అయ్యారు.
ఈ సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం గురించి కూడా రిషబ్ వివరించారు. ఈ సినిమా కోసం మూడు నెలలపాటు తమ బృందం పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడిందని, ఎవరూ విశ్రాంతి కూడా తీసుకోలేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్‌ను తమ సొంత సినిమాగా భావించారని, అందుకే ఎన్నో కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించగలిగామని తెలిపారు. సెట్‌లో జరిగిన పలు ప్రమాదాలు కూడా మీడియా దృష్టికి వచ్చాయని ఆయన గుర్తుచేసుకున్నారు.
‘కాంతార చాప్టర్ 1’ టీమ్ సభ్యులు షూటింగ్ సమయంలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మానేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టర్లపై కూడా రిషబ్ శెట్టి స్పష్టత ఇచ్చారు. అవన్నీ అవాస్తవాలని, కావాలని కొందరు సృష్టించిన తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. “ఆ పోస్టర్లు పూర్తిగా నకిలీవి. వాటితో మా బృందానికి ఎలాంటి సంబంధం లేదు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి ఫేక్ పోస్టర్లను సృష్టించారు” అని ఖండించారు.