అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు, కానీ అడగకుండానే అన్ని ఇచ్చేది జగనన్న మాత్రమే.. అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైయస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవ జరిగిన విలేకరుల సమావేశంలో రోజా మాట్లాడుతూ.. పాదయాత్రలో మహిళల కష్టాలను దగ్గర నుండి చూసిన ముఖ్యమంత్రి జగన్ వారి కన్నీళ్లు తుడవాలి అన్న ఆలోచనతో మేనిఫెస్టోను రూపొందించుకున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారని అన్నారు.
ఈ రోజు ప్రారంభమైన ఆసరా పథకం ద్వారా.. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు దాదాపు 90 లక్షల మంది లబ్ధి పొందారని, 2019 ఎన్నికల సమయానికి డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లో ఉన్న రుణాన్ని మాఫీ చేయడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానిలో భాగంగా నాలుగు విడతలుగా ఆ బకాయి మొత్తాన్ని నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేయనున్నారని తెలిపారు.
వైయస్సార్ ఆసరా పథకం ద్వారా ఈ రోజు డ్వాక్రా సంఘాల మహిళలకు తొలి విడతగా రూ. 6,792 కోట్లు జమ చేసిన ఘనత వైయస్ జగన్ సర్కార్ ది అని ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల గుండెల్లో సంక్షేమ సారథిగా వైఎస్ జగన్ నిలిచిపోతారన్నారు.
