Salman Khan: పిల్లలు కావాలనిపిస్తోంది.. 60 ఏళ్ల వయస్సులో సల్మాన్ ఖాన్ మనసులో మాట
Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా మనసులో మాట బయటపెట్టారు. పెళ్లి చేసుకోనని, కానీ భవిష్యత్తులో తనకు తప్పకుండా పిల్లలు కావాలని ఆయన అన్నారు. ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే టాక్ షోలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో కలిసి సల్మాన్ సందడి చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ ట్వింకిల్ ఖన్నా అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలిచ్చారు.
సల్మాన్ పెళ్లి గురించి గతంలో వచ్చిన వార్తలు, వదంతులపై ట్వింకిల్ సరదాగా స్పందించింది. “సల్మాన్ తనని తాను ‘నవ మన్మథుడు’గా అభివర్ణించుకున్నాడు. బహుశా అతనికి డజన్ మంది పిల్లలు ఉండి ఉండొచ్చు. వాళ్ల గురించి మనకు తెలియదు. సల్మాన్‌కు కూడా తెలిసి ఉండకపోవచ్చు,” అని సరదాగా వ్యాఖ్యానించింది. దీనిపై వెంటనే స్పందించిన సల్మాన్, “నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్లను మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా?” అని నవ్వుతూ సమాధానమిచ్చారు.
పిల్లలను దత్తత తీసుకునే ఆలోచన ఉందా అని అడగ్గా, అలాంటి ఆలోచన లేదని సల్మాన్ ఖాన్ చెప్పారు. అయితే, భవిష్యత్తులో తనకు తప్పకుండా పిల్లలు కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. “ఎప్పుడైనా జరగొచ్చు. ఖచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం కదా! అదంతా దేవుడి దయ,” అని సల్మాన్ వ్యాఖ్యానించారు. తనకు పిల్లలు పుడితే వారిని తన కుటుంబమే చూసుకుంటుందని చెప్పారు. తన మేనకోడలు అలీజ్, మేనల్లుడు అయాన్ కూడా పెరిగి పెద్దయ్యారని, వాళ్లే చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు సలీమ్ ఖాన్, సల్మా ఖాన్ కూడా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని సల్మాన్ ఈ సందర్భంగా వెల్లడించారు. బాలీవుడ్ టాప్ స్టార్స్ సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ పాల్గొన్న ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ తొలి ఎపిసోడ్.. సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.