Salman Khan: మెగాఫోన్ పట్టనున్న సల్మాన్ ఖాన్?.. ఆ సినిమా కోసం భాయిజాన్ సంచలన నిర్ణయం
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు, బాక్సాఫీస్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తన కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందించిన సల్మాన్.. బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వర్షం కురిపించారు. అయితే, గత కొంతకాలంగా ఈ స్టార్ హీరో కెరీర్ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఆయన నటించిన సినిమాలు వరుసగా నిరాశపరుస్తుండటంతో ఫ్యాన్స్ కొంత ఆందోళనలో ఉన్నారు. కథల ఎంపికలో లోపమా లేక మేకింగ్‌లో తేడానా అనే చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హిట్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్, ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారట. ఇన్నాళ్లూ తెరపై హీరోగా అలరించిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగా మారి మెగాఫోన్ పట్టబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, గతంలో సల్మాన్ నటించిన కొన్ని సినిమాలకు వేరే దర్శకుల పేర్లు ఉన్నప్పటికీ, అనధికారికంగా దర్శకత్వ బాధ్యతలు సల్మానే చూసుకున్నారని ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ, ఎప్పుడూ ఆయన డైరెక్టర్‌గా క్రెడిట్ తీసుకోలేదు. అయితే ఈసారి మాత్రం అధికారికంగానే డైరెక్టర్ సీట్లో కూర్చోవడానికి సిద్ధమయ్యారని సమాచారం.
సల్మాన్ కెరీర్‌లో ‘దబాంగ్’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ వేరు. పోలీస్ ఆఫీసర్ చుల్బుల్ పాండేగా ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇదే సిరీస్‌లో రాబోతున్న ‘దబాంగ్ 4’ సినిమాకు సల్మాన్ ఖాన్ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలుకానుంది. ఇందులో సల్మాన్ సరసన మరోసారి సోనాక్షి సిన్హానే భార్య పాత్రలో కనిపించనుండగా, సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘బాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కూడా వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి వరుస ప్లాపులకు చెక్ పెట్టి, తన డైరెక్షన్‌లోనే హిట్ కొట్టాలని సల్మాన్ కసిగా ఉన్నట్లు తెలుస్తోంది.
