Samantha: అత్త వారింట సమంతకు గ్రాండ్ వెల్‌కమ్.. రాజ్ సిస్టర్ పోస్ట్ వైరల్
Samantha: టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత తన అభిమానులకు, సినీ వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె డిసెంబర్ 1న అత్యంత నిరాడంబరంగా వివాహమాడారు. ఈ గుడి పెళ్లి తర్వాత, సోషల్ మీడియా వేదికగా ఈ నూతన జంటకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వివాహం తర్వాత డిసెంబర్ 2న సమంతకు అత్తగారింట్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు సోదరి శీతల్, కొత్త జంటకు విషెస్ చెబుతూ ఒక హృదయాన్ని కదిలించే ఎమోషనల్ నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. నిడిమోరు కుటుంబంలోకి సమంతను ఆహ్వానిస్తున్నామని, ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని శీతల్ ప్రకటించారు. ప్రస్తుతం వారి ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శీతల్ తన పోస్ట్‌లో రాస్తూ, “ఆనందంతో మాటలు రావడం లేదు. గొప్ప భక్తుడు భక్తితో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో, ఈరోజు మా హృదయం ఉప్పొంగుతోంది. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత, రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకుసాగుతుండడం చూసి మేం గర్వపడుతున్నాం. గౌరవం, నిజాయితీతో రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతో నిండిపోతుంది. మేము వారికి ఎప్పుడూ అండగా ఉంటాము” అని పేర్కొన్నారు. ఈ భావోద్వేగ సందేశానికి సమంత ‘లవ్ యూ’ అని రిప్లై ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంది.
సమంత-రాజ్ నిడిమోరుల వివాహం తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈశా యోగా సెంటర్‌లోని లింగభైరవి దేవాలయంలో జరిగింది. సమంత సంప్రదాయ ఎరుపు రంగు చీరలో మెరిసిపోగా, రాజ్ క్రీమ్-గోల్డ్ రంగు కుర్తా ధరించారు. వారి వివాహ వేడుకకు సంబంధించిన నిరాడంబరమైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజ్ సోదరి తన పోస్ట్‌లో ఈశా ఫౌండేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
