Samantha Ruth Prabhu: సినిమాలు చేయడం తగ్గించింది అందుకోసమే..: సమంత
Samantha Ruth Prabhu: సినీ ప్రేక్షకులకు, విమర్శకులకు తన అద్భుతమైన నటనతో దగ్గరైన నటి సమంత రూత్ ప్రభు.. నటిగానే కాకుండా నిర్మాతగానూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘గ్రాజియా ఇండియా’ కవర్ పేజీపై మెరిసిన సమంత.. ఆ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ఫిట్‌నెస్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇప్పటివరకు తాను ఎన్ని సినిమాలు చేశామనేది కాదని, ఎంత మంచి చిత్రాలు, కథలు ప్రేక్షకులకు అందించామనేది ముఖ్యమని సమంత అన్నారు. పదిహేనేళ్లుగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సమంత, ప్రస్తుతం తన ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పారు. “గతంలో ఒకేసారి ఐదారు సినిమాలు చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా శరీరం చెప్పేది వినాలని అర్థమైంది. అందుకే నా ప్రాజెక్ట్‌ల సంఖ్యను తగ్గించుకున్నాను. ఇది నా మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది” అని ఆమె వెల్లడించారు.
ప్రాజెక్ట్‌ల సంఖ్య తగ్గినా, వాటి నాణ్యత మాత్రం తప్పకుండా పెరుగుతుందని సమంత హామీ ఇచ్చారు. “నేను చేసే ప్రతి సినిమా, సిరీస్ నా మనసుకు దగ్గరైన కథలే. కేవలం గుర్తింపు కోసమో, డబ్బు కోసమో చేసేవి కావు. వాటిలో ఒక ప్యాషన్ ఉంటుంది” అని ఆమె స్పష్టం చేశారు. ఈ మార్పు తనలో ఎంతో పరిణతిని తీసుకొచ్చిందని, గొప్ప పనులు చేయగలననే నమ్మకం పెరిగిందని ఆమె చెప్పారు.
సమంత సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను, ట్రోల్స్‌ను కూడా హుందాగా స్వీకరించాలని ఆమె సూచించారు. “ప్రశంసలను ఎలా స్వీకరిస్తామో, విమర్శలను కూడా అలాగే స్వీకరించాలి. వాటిని మనం నియంత్రించాలి తప్ప, అవి మన జీవితాన్ని శాసించకూడదు. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాను” అని ఆమె తెలిపారు.
సమంత ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులు రాజ్, డీకే (Raj and DK) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ (Rakht Brahmand) అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ఇందులో ఆమెతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
