Samantha: బీస్ట్ మోడ్‌లో సమంత.. ఒకేసారి డబుల్ కిక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తన వ్యక్తిగత జీవితంలోనూ, ఆరోగ్యం పరంగానూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు “నేను మామూలు మనిషిని కాదు” అని నిరూపించేలా అద్భుతమైన రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె సొంత బ్యానర్‌లో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సామ్, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడి, శారీరకంగా కాస్త డీలా పడ్డ సమంత.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేస్తూ దిగిన ఫోటోలో ఆమె లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. గ్రే కలర్ స్పోర్ట్స్ బ్రా, నేవీ బ్లూ లెగింగ్స్ ధరించి.. తన బ్యాక్ మజిల్స్, బైసెప్స్ చూపిస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు మామూలుగా లేవు. ఒకప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడ్డ మనిషేనా ఈమె? అన్నట్లుగా ఆమె ఫిట్‌నెస్ లెవెల్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు “సామ్ ఈజ్ బ్యాక్”, “స్ట్రాంగెస్ట్ ఉమెన్” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కేవలం ఫిట్‌నెస్ విషయంలోనే కాదు, కెరీర్ పరంగా కూడా సమంత ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సీజన్‌కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి సమంత ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
సీజన్ 2లో ‘రాజి’ పాత్రలో మెప్పించిన సమంత, తాజా సీజన్ సక్సెస్‌ను తన సొంత విజయంగా భావిస్తున్నారు. ఈ సిరీస్‌కు వస్తున్న 4-స్టార్ రేటింగ్స్, రివ్యూలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. “చాలా రోజుల తర్వాత ఇలాంటి పాజిటివ్ రివ్యూలను చూడటం ఆనందంగా ఉంది” అంటూ రాజ్ & డీకే టీమ్‌ను అభినందించారు. డ్రామా, యాక్షన్ కలగలిసిన ఈ సిరీస్ విజయం, అలాగే తన తాజా ఫిట్‌నెస్ ఫోటోలు.. రెండూ కలిసి సమంత అభిమానులకు ఒకేసారి డబుల్ కిక్ ఇచ్చాయని చెప్పవచ్చు. మొత్తానికి సామ్ తన తదుపరి ప్రాజెక్టులతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
